Friday, November 22, 2024

విద్యాశాఖలో కీలక పోస్టులన్నీ ఖాళీనే! అస్తవ్యస్తంగా మారిన పర్యవేక్షణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పాఠశాల విద్య వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. డీఈవో నుంచి మొదలుకొని డిప్యూటీఈవో, ఎంఈవో, టీచర్‌ పోస్టుల వరకు చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. పాఠశాల విద్యను పర్యవేక్షించే కీలక పోస్టులన్నీ గత కొన్నేళ్లుగా ఖాళీగానే ఉంటున్నాయి. ఖాళీ ఉన్న పోస్టుల్లో ఇంఛార్జీలను నియమించి నెట్టుకొస్తున్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలుంటే 12 మందే రెగ్యులర్‌ డీఈవోలు పనిచేస్తున్నారు. మిగిలిన 21 జిల్లాలకు ఇంఛార్జీలే దిక్కు. ఇక తెలంగాణలో 66 డిప్యూటీఈవో పోస్టులుంటే ఇద్దరే రెగ్యులర్‌ డిప్యూటీ ఈవోలు ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలోని 596 మండలాలుంటే అందులో 20 మందే రెగ్యులర్‌ ఎంఈవోలున్నారు. మిగిలిన చోట్ల ఉన్నత పాఠశాలల్లో పనిచేసే సీనియర్‌ హెచ్‌ఎంలకు ఇంఛార్జీ ఎంఈవోలుగా బాధ్యతలు అప్పగించారు. వీరిలో ఒక్కోక్కరికీ 2 నుంచి 12 మండలాల బాధ్యతలు ఉన్నాయి. ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ కేసు ఉండటంతో ఎంఈవోల నియామకం జరగడంలేదు. మరోవైపు టీచర్‌ పోస్టులు రాష్ట్రంలో 16,122 ఖాళీగా ఉన్నట్లు మొన్న జరిగిన సమగ్రశిక్షా అభియాన్‌ పీఏబీ సమావేశంలో కేంద్రం తెలిపింది. టీచర్‌ సంఘాలు మాత్రం సుమారు 21వేల వరకు టీచర్‌ పోస్టులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయని పేర్కొంటున్నాయి. పండిట్‌, పీఈటీ అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియ పెండింగ్‌లోనే ఉంది. 5571 ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం పోస్టులనూ ప్రభుత్వం మంజూరు చేయాల్సిన ప్రతిపాదన ఇంకా పెండింగ్‌లోనే ఉంది. విద్యాశాఖలో ముఖ్యమైన పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో పాఠశాల విద్యా వ్యవస్థ పడకేస్తోందని టీచర్‌ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దాంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని దాక్షగా మారిందని అంటున్నాయి. రాష్ట్రంలో కొత్త జిల్లాలకు పోస్టులను మంజూరు చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉన్న అరకొర పోస్టులతోనే పాఠశాల విద్యాశాఖ నెట్టుకొస్తోంది. చాలా చోట్ల పర్యవేక్షణాధికారులు లేకపోవడంతో విద్యావ్యవస్థ గాడితప్పుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిపాలనా సౌలభ్యం కొరకు 2016 లో తెలంగాణ ప్రభుత్వం పది జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విభజించింది. కానీ అదే పరిపాలనా సౌలభ్యం కొరకు కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కొత్త పోస్టులను మాత్రం మంజూరు చేయలేదు. దీంతో డీఈవో, ఎంఈవో, డిప్యూటీ ఈవో రెగ్యులర్‌ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఏండ్లుగా ఈ పోస్టులను భర్తీ చేయక ఎఫ్‌ఏసీ, ఇన్‌ఛార్జుల పాలనే సాగుతోంది. రాష్ట్రంలో 33 జిల్లాల పరిధిలో మొత్తం స్కూళ్లు సుమారు 36 వేల వరకు ఉంటే, అందులో సుమారు 3.5లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 1.06 లక్షల మంది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. అలాగే మొత్తం స్కూళ్లల్లో సుమారు 60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లు, ప్రైవేట్‌ పాఠశాలలను పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో ఎంఈవోలు, ఆపైస్థాయిలో డిప్యూటీఈవోలు, జిల్లాస్థాయిలో డీఈవోలదే కీలక పాత్ర. కానీ చాలా వరకు పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో పర్యవేక్షణ మరుగున పడుతోంది. రాష్ట్రంలో 33 జిల్లాలుంటే అందులో 12 డీఈవో పోస్టులే ఉన్నాయి. ఇంకా 21 డీఈవో పోస్టులు మంజూరు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తుందనే అభిప్రాయాలను ఉపాధ్యాయ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల్లో హెచ్‌ఎంలు, డైట్‌, బీఈడీ కాలేజీ లెక్చరర్లను, ప్రొఫెసర్లను, అసిస్టెంట్‌ డైరెక్టర్లకు అదనపు బాధ్యతలను అప్పగించి విద్యా పర్యవేక్షణను మమ అనిపిస్తున్నారు.

ఏఎంవో పోస్టులను వ్యతిరేకిస్తున్న సంఘాలు…
ఇంచార్జీ ఎంఈవోలకు సహాయకులుగా, విద్యా సామర్థ్యాలను పెంచడంలో భాగంగా ప్రతి మండలానికి ఒక అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ను నియమించాలని విద్యాశాఖ భావిస్తోంది. వీరు ఇంఛార్జీ ఎంఈవోలకు సహాయకులుగా వ్యవహరిస్తుంటారు. అయితే ఈవిధమైన ప్రయత్నాలను మానుకోవాలని డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం.రఘుశంకర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డిలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 580వరకు ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఖాళీపోస్టుల్లో హెచ్‌ఎంలకు ఇంఛార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తున్నారు తప్పితే కొత్తగా నియామకాలు చేపట్టడంలేదని ఆరోపించారు. కోర్టు కేసులతో వీటి భర్తీ సాధ్యం కాకపోతే మండల పరిషత్‌ విద్యాధికారిగా పేరు మార్చి అయినా నియమించాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement