Tuesday, November 19, 2024

Seventh Phase – తుది విడ‌త పోలింగ్ కు స‌ర్వం సిద్ధం.. 57 లోక్ సభ స్థానాల‌లో 904 మంది పోటీ


లోక్‌సభ ఎన్నికల ఘట్టం క్లైమాక్స్‌కు చేరింది. ఏడు విడతల్లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా తుది దశ ఓటింగ్ రేపు జరగనుంది.. ఏడు రాష్ట్రాల‌లోని 57 లోక్‌సభ సీట్లకు ఈ ద‌శ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. మొత్తం 904 మంది అభ్య‌ర్ధులు రంగంలో ఉన్నారు. ఏడో ద‌శ‌లో యూపీలో13 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగున్నాయి. బీహార్‌లోని 8, పశ్చిమ బెంగాల్‌లో 9, జార్ఖండ్‌ 3, పంజాబ్ 13, హిమాచల్ ప్రదేశ్ 4, ఒడిశా 6 లోక్ సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అటు కేంద్ర పాలిత ప్రాంతం చండీఘ‌ర్‌కు ఈ విడతతోనే ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. పంజాబ్ నుంచి అత్యధికంగా 328 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా..ఆ తర్వాత యూపీలో 144 మంది , బిహార్‌లో 134 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ప్రధాని మోదీ బరిలో నిలిచిన వారణాసి నియోజకవర్గానికి.. ఏడో దశలోనే ఓటింగ్ జరగనుంది. పోలింగ్ నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన ఈవిఎంల‌తో సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాల‌కు చేరుకుంటున్నారు..

ఎన్నిక‌ల బ‌రిలో మోదీ…

- Advertisement -

చివరి విడత ఎన్నికల బరిలో వారణాసిలో ప్రధాని మోదీపై.. కాంగ్రెస్ కీలక నేత అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. దీంతో కాశీలో పోలింగ్ పై ఆసక్తి నెలకొంది. అలాగే బీజేపీకి చెందిన సినీ నటి కంగనా రనౌత్, కాంగ్రెస్ నుండి విక్రమాదిత్య సింగ్ మండి నుండి బరిలో ఉన్నారు. గోరఖ్‌పూర్‌ నుంచి బీజేపీ అభ్యర్థి రవికిషన్‌, సమాజ్‌వాదీ అభ్యర్థి కాజల్‌ నిషాద్‌ మధ్య పోటీ నెలకొంది. హమీర్‌పూర్‌ నుంచి బీజేపీ తరఫున అనురాగ్‌ ఠాకూర్‌, కాంగ్రెస్‌ తరఫున సత్యపాల్‌ సింగ్‌ బరిలో ఉన్నారు. బెంగాల్‌లోని డైమండ్ హార్బర్‌లో టీఎంసీ అభ్యర్థి అభిషేక్ బెనర్జీ, బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్ మధ్య పోటీ నెలకొంది. బీహార్‌లోని పాటలీపుత్ర స్థానం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

జూన్ ఒక‌టిన చివ‌రి ద‌శ పోలింగ్ ..

జూన్ 1 జరిగే ఎన్నికలతో దేశ వ్యాప్తంగా 543 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. ఇందులో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ స్థానం ఏకగ్రీవం కావడంతో 542 లోక్ సభ సీట్ల ఫలితాలను జూన్ 4న ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది . మొత్తంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ శనివారంతో ఎన్నికల క్రతువు పూర్తవుతోంది. ఏప్రిల్ 19వ తేదీన ప్రారంభమైన మొదట దశ పోలింగ్.. జూన్ 1 జరిగే ఏడో విడత పోలింగ్‌తో మొత్తం 542 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి. తుదివిడతలో ఎంత పోలింగ్‌ శాతం నమోదవుతుందన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది.

ఆరు ద‌శ‌ల‌లో త‌గ్గిన ఓటింగ్ శాతం ..

ఆరు దశల్లో జరిగిన పోలింగ్‌లో ఎవరిది పైచేయి అన్న విషయంపై ఇప్పటికి క్లారిటీ రావడం లేదు. పార్టీలు హోరాహోరీగా భావిస్తున్న ఈ ఎన్నికలను..ప్రజలు మాత్రం సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. గత ఆరు విడతల్లో నమోదైన పోలింగ్గే అందుకు నిదర్శనం. తొలి దశలో 66.14 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత రెండో విడతలో 66.71 శాతం, మూడో దశలో 65.68 శాతం, నాలుగో దశలో 69.16 శాతం, ఐదో దశలో 62.2 శాతం, ఆరో విడత పోలింగ్‌లో 61.98 శాతం పోలింగ్‌ నమోదైంది. మరోవైపు ఇప్పటికే ఆరు దశల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన ఈసీ.. ఇప్పుడు చివరి దశ ఎన్నికలను కూడా అదే విధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. మొత్తంగా రెండు నెలలకు పైగా కొనసాగిన సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ..జూన్ 4న ఎన్నికల ఫలితాలతో పూర్తి కానుంది.

ఇక అంద‌రి క‌ళ్లు ఎగ్జిట్ పోల్స్ పైనే..

ఇక శనివారం పోలింగ్‌ పూర్తి కాగానే వెలువడే ఎగ్జిట్‌ పోల్స్‌పై కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీకి 400 సీట్లు ఖాయమని , ప్రధాని పగ్గాలను మోదీ మూడోసారి చేపట్టడం ఖాయమని బీజేపీ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు. అయితే బీజేపీకి ఉత్తరాదిలో సీట్లు చాలా తగ్గుతాయని విపక్షాలు చెబుతున్నాయి. బీజేపీ తరపున సుడిగాలి ప్రచారం చేశారు మోదీ. ఒక్కో దశలో ఒక్కో అంశాన్ని హైలైట్‌ చేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. కాంగ్రెస్‌ ప్రచారాన్ని రాహుల్‌గాంధీతో పాటు ప్రియాంకాగాంధీ తమ భుజాలపై వేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement