Saturday, January 18, 2025

Swearing Ceremony – ట్రంప్ కోసం అంతా రెడీ!

ఎల్లుండే ప్రెసిడెంట్‌ ప్ర‌మాణ స్వీకారం
అమెరికా 47వ అధ్య‌క్ష‌డిగా డొనాల్డ్ ట్రంప్‌ ఎన్నిక‌
ప్ర‌మాణ స్వీకార మ‌హోత్స‌వానికి స‌న్నాహాలు
వాషింగ్ట‌న్‌లో విప‌రీత‌మైన చ‌లి
మైన‌స్ 11 డిగ్రీలుగా న‌మోద‌వుతున్న టెంప‌రేచ‌ర్లు
చలి ప్ర‌భావంతో రోటుండా భ‌వ‌నంలోప‌ల‌ ఏర్పాట్లు
ఇన్‌డోర్‌లో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న ట్రంప్‌
1985లో అప్ప‌టి అధ్య‌క్షుడు ఇదే త‌ర‌హాలో ప్ర‌మాణ స్వీకారం
క‌నీవిని ఎరుగ‌ని స్థాయిలో భ‌ద్ర‌తా ఏర్పాట్లు
ప్ర‌త్యేక నిఘా పెట్టిన సీక్రెట్ స‌ర్వీస్ ఏజెంట్లు
నాకోసం వ‌చ్చి ఇబ్బందులు ప‌డొద్దన్న ట్రంప్
చ‌లిని లెక్క‌చేయ‌కుండా త‌ర‌లివ‌స్తున్న అభిమానులు

వాషింగ్ట‌న్, ఆంధ్ర‌ప్ర‌భ‌:
అమెరికా 47వ దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (78) ఈ నెల 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికోసం వాషింగ్టన్ సిటీ క్యాపిటల్ భవనంలో ఉన్న గోళాకార సముదాయం (రోటుండా)ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం వాషింగ్టన్‌లో ఎముకలు కొరికే చలి ఉన్నందున, రోటుండా సముదాయం లోపల వెచ్చటి వాతావరణంలో ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు . సాధారణంగా అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని క్యాపిటల్ భవనం పశ్చిమ భాగంలో నేషనల్ మాల్, జాతీయ చిహ్నాల ఎదుట నిర్వహించేవారు. వేలాది మంది ప్రజానీకం సాక్షిగా ఈ ఘట్టం జరిగేది. కానీ, ఈ సారి చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో క్యాపిటల్ భవనం లోపల ఉండే రోటుండా సముదాయంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

- Advertisement -

మైన‌స్ 11 డిగ్రీల చ‌లి..

అయినా.. చలిని లెక్క చేయకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్‌‌‌‌కు చేరుకుంటున్నారు. పెద్ద మొత్తంలో చార్జీలు చెల్లించి మరీ నగరంలోని హోటళ్లలో బస చేస్తున్నారు. ఇదే అదనుగా హోటళ్ల నిర్వాహకులు సాధారణం కంటే మూడు, నాలుగు రెట్లు ఎక్కువగా రూమ్ రెంట్‌ వసూలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ట్రంప్ ప్రమాణ స్వీకారం జరగనున్న సోమవారం రోజున వాషింగ్టన్ డీసీలో ఉష్ణోగ్రతలు సగటున మైనస్ 11 డిగ్రీల సెల్సీయస్ మేర ఉంటాయని వాతావరణశాఖ‌ అంచనాలు వేస్తోంది.

నాకోసం వ‌చ్చి ఇబ్బంది ప‌డొద్దు..

తన ప్రమాణ స్వీకార వేదికను క్యాపిటల్ భవనంలోని రోటుండా సముదాయంలోకి మార్చారని తెలుపుతూ డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్కిటిక్ ప్రాంతం వైపు నుంచి వాషింగ్టన్ దిశగా బలమైన చలిగాలులు వీస్తున్నాయని తెలిపారు. “వాతావరణం బాగా లేదు. ఈ నెల 20న నా ప్రమాణ స్వీకారం వేళ వేలాది మంది అనుచరులు, భద్రతా సిబ్బంది, పోలీసులు ఇబ్బంది పడాలని నేను కోరుకోవడం లేదు” అని ట్రంప్ పేర్కొన్నారు. చివరిసారిగా 1985 జనవరి 20వ తేదీన అమెరికాలో దేశాధ్యక్షుడిగా రోనాల్డ్ రీగ‌న్ ప్రమాణ స్వీకారం ఈ విధంగా రోటుండా సముదాయంలో జరిగింది. అప్పట్లో మైనస్ 14డిగ్రీలసెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది.

కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు..

ట్రంప్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో వాషింగ్టన్‌లో కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో దాదాపు 30 మైళ్ల పరిధిలో తాత్కాలిక కంచె ఏర్పాటు చేశారు. దాదాపు 25వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. అంచెలవారీగా భద్రతా వలయాన్ని దాటితే కాని వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనాన్ని చేరుకోలేరు. ప్రత్యేక అతిథులు, ఆహ్వానితులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఈ తరుణంలో అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా తమ పనిని మొదలుపెట్టారు. కార్యక్రమానికి అంతరాయం కలిగించే చర్యలను, నిరసనలను ముందస్తుగా గుర్తించే పనిలో పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement