భూపాలపల్లి రూరల్ మే 7 (ప్రభ న్యూస్) : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని, బీజేపీని గద్దె దింపేందుకు లౌకిక శక్తులన్నీ ఏకం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంగడి స్థలంలో ఏర్పాటుచేసిన మే డే ముగింపు వారోత్సవాలు సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు అధ్యక్షతన జరిగాయి ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వo మతాలు, కులాల పేరుతో సమాజంలో మత చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు. దేశంలో ప్రజా సంక్షేమ పాలన కొరవడిందని, కేవలం అదానీ అంబానీలకు మన దేశ సంపదను కట్టపెట్టేందుకు మోడీ పాలన కొనసాగుతుందని అన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, సింగరేణి, రైల్వేలు తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నుతోందని వీరభద్రం అన్నారు. శ్రామికులు కష్టజీవుల నుండి ఉద్భవించిందే ఎర్రజెండా సీపీఎం పార్టీ అని.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల సంక్షేమానికి పాటుపడాలని కోరారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చి తొమ్మిది సంవత్సరాలు గడిచినప్పటికీ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు. నిరుపేదలకు లక్షలాది ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన కేంద్రం కేవలం బడా పెట్టుబడిదారుల జేబులు నింపేందుకు జీఎస్టి పేరుతో పేదలను అధిక పన్నుల భారం మోపి పేదలు, బడుగు బలహీన వర్గాలకు తీరని మోసం చేశారని అన్నారు. కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రధాని మోడీని గద్దె దింపేందుకు దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక పార్టీలు బిజెపి మినహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏకమై కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించాలని తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.
పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతాం..
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయకపోతే వామపక్ష పార్టీలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా పోరాటాలు చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం పూర్తయి పేదలకు పంపిణీ కాలేదని ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని వీరభద్రం డిమాండ్ చేశారు. అంతేకాకుండా సిపిఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని నీడ కల్పించుకునేందుకు భూ పోరాటాలు చేసి గుడిసెలు నిర్మించుకున్న కారణంగా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని అదేవిధంగా పేదలు ఆక్రమించుకున్న స్థలాలలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇండ్ల నిర్మాణం కోసం కేటాయించాలని తమ్మినేని వీరభద్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇండ్లు కట్టించి ఇవ్వకపోతే బి ఆర్ ఎస్ ప్రభుత్వంపై కూడా వామపక్ష పార్టీలు పోరాటాలు చేస్తాయని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె వెంకటేష్ జిల్లా నాయకులు కంపేటి రాజయ్య వెలిశెట్టి రాజయ్య దామెర కిరణ్ తదితరులు పాల్గొనగా సమావేశానికి ముందు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్ దేవాలయం నుండి అంగడి స్థలం వరకు గుడివాసులు సిపిఎం నాయకులు కార్యకర్తలు ఎర్రజెండాలు చేత భూనీ భారీ ర్యాలీ నిర్వహించారు.