Friday, November 22, 2024

బీసీ బిల్లు సాధనే లక్ష్యంగా బీసీ సంఘాలు.. రిజర్వేషన్ల అమలుకు పలు పార్టీల స‌పోర్ట్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్‌లో బీసీ బిల్లు సాధనే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ వెల్లడించారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజ్యాంగబద్దమైన రిజర్వేషన్లను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీజం పడే విధంగా తమ కార్యాచరణ రూపొందించుకుంటున్నామని తెలిపారు. శనివారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీసీల జనగణన, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల అమలు, పారిశ్రామిక, వాణిజ్య, విద్య, ఉద్యోగ, సహజ, ఆర్ధిక వనరులలో బీసీలకు సమాన వాటా(50 శాతం), ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా బీసీలకు సైతం సామాజిక భద్రతను కల్పించే బిల్లు ఆవశ్యకతను తెలియజేసే నివేదిక ప్రతులను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు, బీసీ ఎంపీలకు అందజేశామన్నారు.

జనాభా దామాషా ప్రకారం బడ్జెట్‌లో బీసీలకు నిధులు కేటాయించడం, బీసీ సబ్ ప్లాన్ తదితర అంశాలతో కూడిన బీసీ బిల్లు సాధన కోసం త్వరలోనే ఎంపీలతో అంతర్గత సమావేశాలు, పార్లమెంట్‌లో శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడతామని దాసు సురేష్ చెప్పారు. బీసీ బిల్లును ప్రవేశపెట్టే విధంగా విభిన్న పద్దతులలో తమ పోరాటాలను ఉదృతం చేస్తూ కేంద్రంపై అన్ని విధాలా ఒత్తిడి పెంచే విధంగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ నెల 29 నుంచి జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో ఢిల్లీలో చేపట్టే ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement