Saturday, November 2, 2024

TG | రాష్ట్ర మంతటా…. కార్తీక శోభ : మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి డిసెంబర్‌1వ తేదీ వరకు వైభవోపేతంగా కార్తీకమాస దీపోత్సవ వేడుకల నిర్వహిస్తున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. కార్తీక మాసం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభను వెల్లివిరివేసేలా చర్యలు తీసుకోవాలని కార్యనిర్వహణాధికారులు, సహాయ కమిషనర్లకు మంత్రి శనివారం ఆదేశాలు జారీ చేశారు.

కార్తీకమాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ఆలయాలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు కార్తీక దీపోత్సవ వేడుకలను నిర్వహించాలని ఆదేశాలలో వివరించారు. సామూహిక కార్తీక దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు రెండు మట్టి ప్రమిదలు, నూనె, వత్తులు ఉచితంగా అందించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

కార్తీక మాస దీపోత్సవ వేడుకలకు హాజరయ్యే మహిళా భక్తులకు ఉచితంగా పసుపు కుంకుమ అందిస్తారని, ప్రధాన దేవాలయాల్లో మహిళా భక్తులకు బ్లౌజ్‌ పీస్‌ల అందజేస్తామన్నారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం సామూహిక దీపోత్సవ సమయంలో స్థానిక కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసాద పంపిణీ ఉంటుందన్నారు.

ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి రోజులను పురస్కరించుకుని మొత్తంగా కార్తీక మాసంలో ఐదు రోజులపాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రవచనాలు, భజనలు, కీర్తనలు, భక్తి పాటలు, శాస్రీయ సంగీతం, నృత్యాలు, బుర్రకథ, హరికథ తదితర కార్యక్రమాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరగుతుందన్నారు.

కార్తీకదీపాలను వదిలేందుకు నీటి కొలనుల ఏర్పాటు చేయాలని, అవకాశమున్నచోట ప్రత్యేక నది హారతి కార్యక్రమాల నిర్వహించాలని మంత్రి ఆదేశాలలో పేర్కొన్నారు. కార్తీక మాస దీపోత్సవ వేడుకల నిర్వహణ సందర్భంగా ప్రముఖ ఆలయాలలో అభిషేకాలు, హోమాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు వంటి ప్రత్యేక పూజలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement