కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్ రంగస్వామి ప్రమాణస్వీకారం చేశారు. ఇంచార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ మధ్యాహ్నం రాజ్ భవన్ లో రంగస్వామి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. పుదుచ్చేరి సీఎంగా ప్రమాణం చేసిన రంగసామికి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసైతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలుండగా ఎన్డీయే కూటమి 16 స్థానాలు గెలిచింది. ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన 16 స్థానాల్లో పదింటిని గెలుచుకుంది. ఎన్ఆర్ కాంగ్రెస్ మిత్రపక్షం బీజేపీ తొమ్మిది స్ధానాల్లో పోటీ చేయగా.. 6 చోట్ల విజయం సాధించింది. మరో ఆరుగురు స్వతంత్రులు గెలుపొందగా.. వారంతా రంగస్వామి మద్దతుదారులే కావడం గమనార్హం. డీఎంకే 13 స్థానాల్లో పోటీ చేయగా ఆరు, కాంగ్రెస్ 14 స్థానాల్లో పోటీ చేయగా.. 2 సీట్లు దక్కాయి. కాగా, కేంద్ర పాలిత ప్రాంతం యానాం నుంచి పుదుచ్చేరి సీఎం అభ్యర్థి రంగస్వామి పోటీ చేయగా.. అనూహ్య రీతిలో ఆయన యానాంలో ఓడిపోయారు. స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ 656 ఓట్ల తేడాతో రంగస్వామిపై గెలుపొందారు.