దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో వాయిదా పడుతున్న పరీక్షల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఆలిండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఐఎల్ఈటీ)2021ను నేషనల్ లా యూనివర్సిటీ వాయిదావేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జూన్ 20న జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో పరీక్షను వాయిదా వేశామని, మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రతిష్ఠాత్మక ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీలో బీఏ ఎల్ఎల్‌బీ (హానర్స్), ఎల్ఎల్ఎం, పీహెచ్‌డీ కోర్సులు అడ్మిషన్ కల్పిస్తారు.
కాగా పరీక్ష వాయిదా పడిన నేపథ్యంలో దరఖాస్తు గడువును జూన్ 25 వరకు పొడిగించింది. దరఖాస్తు చేసుకోవాలనేవారు అధికారిక వెబ్‌సైట్ nludelhi.ac.inను సంప్రదించవచ్చని సూచించింది. దరఖాస్తు ఫీజు రూ.3,050 చెల్లించాల్సి ఉంటుందని, ఎలాంటి వయోపరిమితి లేదని వెల్లడించింది.