రాజస్థాన్‌లో ఓ రైతుకు చెందిన ఐదుగురు కుమార్తెలు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడం విశేషం. హనుమాన్‌గఢ్‌కు చెందిన సహదేవ్ సహరన్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు. రైతు అయినప్పటికీ ఆయన తన కుమార్తెలందరినీ చదివించాడు. ఇప్పుడా ఐదుగురు కుమార్తెలు రాజస్థాన్ ప్రభుత్వంలో ఉన్నతోద్యాగాలు సాధించి శభాష్ అనిపించుకుంటున్నారు.
కొన్నిరోజుల కిందటే ఆర్ఏఎస్ (రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో ఉత్తీర్ణులు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో సహదేవ్ కుమార్తెలు రీతు, సుమన్, అన్షు కూడా ఉన్నారు. ఆ రైతు మరో ఇద్దరు కుమార్తెలు రోమా, మంజు గతంలోనే ఆర్ఏఎస్ కొలువులు సాధించి జీవితంలో స్థిరపడ్డారు. ఒకే ఇంట్లో ఐదుగురు అమ్మాయిలు ఆర్ఏఎస్ సాధించడం మీడియాలో ప్రముఖంగా దర్శనమిస్తోంది. ఈ అంశాన్ని ఓ అటవీశాఖ ఉన్నతాధికారి ట్విట్టర్ లో పంచుకున్నారు. సరైన విధంగా ప్రోత్సహిస్తే అమ్మాయిలు కూడా ఉన్నతస్థాయికి ఎదగగలరని ఈ రాజస్థాన్ అక్కాచెల్లెళ్లు నిరూపించారు. తాజాగా ఆ రైతు కుటుంబంలో ముగ్గురమ్మాయిలు కూడా ఉద్యోగాలు సాధించడంతో హనుమాన్ గఢ్ వాసుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్త కూడా చదవండి: మరో 50వేల ఉద్యోగాల కోసం కార్యాచరణ