హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ‘ప్రజా పాలన’తో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని నిర్విరామంగా, నిరంతరాయంగా కొనసాగిస్తుంటే.. ప్రతిపక్ష భారాస ఓర్వలేక నిందలు మోపుతోందని అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారనీ, రెండు మంత్రి పదవులు ఇస్తే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్‌లోకి వస్తానన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్‌ఎస్ అధినేతపై ప్రజల్లోనే కాదు.. ఆ పార్టీ ఎమ్మెల్యేల్లోనూ నమ్మకం లేదన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పరిధిలోని గోమారంలో జరిగిన చిన్న ఘటనను హరీశ్ రావు ఇంత రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. అనవసరంగా తమను రెచ్చగొట్టి మిమ్మల్ని మీరే బొంద పెట్టుకోకండనీ హెచ్చరించారు. కాంగ్రెస్ ఒక్కసారి గేట్లు తెరిస్తేనే మీరు తట్టు కోలేకపోయారని ఇక పూర్తిగా తెరిస్తే బీఆర్‌ఎస్ ఖాళీ అవుతుందని పేర్కొన్నారు.
కేటీఆర్, హరీశ్ రావు కావాలనే కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇక నుంచి వాళ్లే తమ టార్గెట్ అని అన్నారు. తమ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ వాళ్లవి క్రిమినల్ మైండ్లు అని, విద్యుత్ అధికారులు కొందరు వాళ్లకి సహకరిస్తూ రైతులకు కరెంటు కోతలు విధిస్తున్నారని అన్నారు.
అలాంటి చర్యలకు పాల్పడ్డ అధికారులు సస్పెండ్ కాక తప్పదని హెచ్చరించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలోని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నివాసంపై దాడి ఘటన విషయం తెలిసిందే. వినాయక విగ్రహ నిమజ్జనంలో భాగంగా సునీతా ఇంటి వద్ద కాంగ్రెస్ శ్రేణులు బాణా సంచా పేల్చడాన్ని బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి.
దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సమయంలో ఇంట్లో సునీతా లక్ష్మారెడ్డితో పాటు కుటుంబసభ్యులు లేరు. వెంటనే పోలీసులు రంగలోకి దిగి, ఇరువర్గాల కార్యకర్తలకు నచ్చచెప్పి పంపించారు. కాంగ్రెస్ శ్రేణులు ఇంట్లోకి వచ్చి తమపై దాడి చేశారని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు శివంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
”గోమారంలో జరిగిన చిన్న ఘటనను హరీశ్ రావు ఇంత రాద్ధాంతం చేయడం సరికాదు. ఆయన కావాలనే కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలు చేయాలని చూస్తున్నారు. తమ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారు. రెండు మంత్రి పదవులు ఇస్తే బీఆర్‌ఎస్ ఉన్న ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్‌లోకి వస్తామని అంటున్నారు” అని మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాము అనుకుంటే భారాస ఖాళీ కావడం ఖాయమని హెచ్చరించారు. హరీష్‌రావు తమ నోటి దూలను తగ్గించుకోవాలని, అనవసరమైన ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు, పార్టీ పథనం ఖాయమని మైనంపల్లి ఉద్ఘాటించారు.