న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 లో పొందుపర్చిన అనేక హామీలు నేటికీ పెండింగులో ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మంగళవారం లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ సమస్యలను ప్రస్తావించిన ఆయన, త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో జరుగుతున్న జాప్యం గురించి ఆయన సభలో లేవనెత్తారు. తక్షణమే బకాయిలు చెల్లించడంతో పాటు అదనపు నిధులు మంజూరు చేసి ప్రాజెక్టు నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా సహకరించాలని కేంద్రాన్ని కోరారు.
రాష్ట్రంలో సెంట్రల్ యూనివర్సిటీలకు సంబంధించి 2022-23లో రూ. 1,500 కోట్ల మేర నిధులు అవసరముండగా.. కేవలం రూ. 56.66 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. ఇవి జీతభత్యాల చెల్లింపుకే సరిపోతాయని, కొత్త క్యాంపస్ భవనాల నిర్మాణం కోసం ఏమాత్రం సరిపోవని పేర్కొన్నారు. రాష్ట్రానికి 17 వైద్య కళాశాలల అవసరం ఉందని, కానీ కేంద్రం కేవలం 3 మెడికల్ కాలేజీలకు మాత్రమే అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో గోదావరి, పెన్నా నదుల అనుసంధానం ప్రక్రియ దీర్ఘకాలంగా పెండింగ్‌లోనే ఉందని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందని, 58% జనాభా ఉన్న రాష్ట్రానికి కేవలం 45% ఆదాయమే మిగిలిపోయిందని, లోటుతో ఏర్పడ్డ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ హామీ మేరకు ప్రత్యేక హోదాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ద్రవ్యోల్బణం, ఆహార ధాన్యాల కొరత కారణంగా ఆహార సబ్సిడీకి సంబంధించి పీఎంజీకేవై పథకాన్ని అధిక రేటుతో పొడిగించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.16,400 కోట్లు కేటాయించారని, అయితే గతేడాది ఖర్చుతో పోలిస్తే అది రూ.8600 కోట్లు తక్కువగా ఉందని ఎంపీ పేర్కొన్నారు. తయారీ సేవా రంగాలు నష్టాలను ఎదుర్కొన్నాయని, టీసీఎస్, విప్రో వంటి టెక్ కంపెనీల్లో కూడా ఇదే పరిస్తితి ఉందని, ఉద్యోగాలు కష్టతరంగా మారాయని తెలిపారు. నిరుద్యోగ రేటు 8% పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
– గ్రాంట్ల సప్లిమెంటరీ డిమాండ్లలో దాదాపు 25% ఎరువుల సబ్సిడీకి కేటాయించగా, దాదాపు నాలుగింట ఒక వంతు కేటాయింపులు మాత్రమే జరిగాయని అన్నారు. దేశీయంగా ఎరువుల ఉత్పత్తి ప్రస్తుతం 36.2 లక్షల టన్నులు కాగా, అక్టోబర్‌లో కావాల్సిన లక్ష్యం 41.5 లక్షల టన్నుల కంటే చాలా తక్కువ ఉందని తెలిపారు. కేంద్ర లోటు బడ్జెట్ ను అధిగమించేందుకు సెస్‌లు, సర్‌ఛార్జీల నుండి కేంద్రం ఆదాయం పెంచుకోవచ్చని పేర్కొన్నారు. 2011-12లో 10.4% నుండి 26.7%కి స్థూల పన్ను రాబడిలో సెస్‌లు, సర్‌ఛార్జీల నుండి కేంద్రం ఆదాయం పెరిగిందని తెలిపారు. 2021-22. కేంద్రం జీఎస్టీ పరిహారాన్ని 5 సంవత్సరాలు పొడిగించాలని లేదంటే సెస్, సర్‌చార్జిల ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు కూడా వాటా ఇవ్వాలని లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.