Friday, November 22, 2024

Delhi: అన్నింటా ‘ఆధార్‌’ .. పెరుగుతున్న లావాదేవీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో ‘ఆధార్’ లావాదేవీలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత జులై నెలలో 152.5 కోట్లు ఆధార్ ధృవీకరణ లావాదేవీలు నమోదయ్యాయి. అలాగే 22.84 కోట్ల ఈ-కేవైసీ లావాదేవీలు జరిగాయి. మరోవైపు ఆధార్ చిరునామా, ఇతర వివరాల్లో మార్పులు కోరుతూ 1.47 కోట్ల అభ్యర్థనలు రాగా, అన్నీ విజయవంతంగా పరిష్కారమయ్యాయని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

కొత్తగా జులై నెలలో 53 లక్షల మంది ‘ఆధార్’ నమోదు చేసుకున్నారని వెల్లడించింది. దేశం జనాభాలో పిల్లలు మినహా పెద్దల్లో చాలా వరకు ‘ఆధార్’ నమోదు చేసుకున్నట్టేనని కేంద్రం పేర్కొంది. దేశవ్యాప్తంగా 93.41 శాతం పెద్దలతు ఆధార్ నెంబర్లు ఉన్నాయని, 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 90 శాతం కంటే ఎక్కువ మంది పెద్దలు ఆధార్ కలిగి ఉన్నారని తెలిపింది.

ఈ గణాంకాలు దేశమంతటా ఆధార్ నమోదు, వినియోగం, స్వీకరణలో పురోగతిని సూచిస్తున్నాయని తెలిపింది. జూలై నెలాఖరు వరకు నివాసితుల కోసం ఇప్పటివరకు 134.11 కోట్లకు పైగా ఆధార్ నెంబర్లు రూపొందాయని వివరించింది. ఆధార్ ద్వారా సుపరిపాలన, సంక్షేమ సేవల సమర్థత, పారదర్శకత పెరుగుతోందని కేంద్రం చెప్పింది. ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న దేశంలోని దాదాపు 900 సామాజిక సంక్షేమ పథకాలు ఆధార్‌ను ఉపయోగిస్తున్నాయని కేంద్రం వెల్లడించింది. ఆధార్ నెంబర్ ఆధారంగా లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ చేస్తున్న పథకాల్లో జులై నెలలో రూ. 12,511 కోట్ల మేర చెల్లింపులు జరిగాయని వెల్లడించింది.

ఈ-కేవైసీ, లాస్ట్ మైల్ బ్యాంకింగ్ కోసం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్), లేదా ఆధార్ ఎనేబుల్ చేసిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్, ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా విజన్‌కు మద్దతు ఇవ్వడంలో ఆధార్ అద్భుతమైన పాత్ర పోషిస్తోందని కేంద్రం తెలిపింది. జూలైలో ఆధార్ ద్వారా అమలైన e-KYC లావాదేవీల సంఖ్య 22.84 కోట్లు కాగా, ఇప్పటివరకు e-KYC లావాదేవీల మొత్తం సంఖ్య జూన్‌లో 1226.39 కోట్ల నుండి జూలైలో 1249.23 కోట్లకు చేరిందని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement