కర్నూలు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీ చేయడానికి సిద్ధమన్న ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ వ్యాఖ్యలు చౌకబారినవని.. జనసేన నేత నాగబాబు అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తానని అలీ చేసిన వ్యాఖ్యలపై స్పందించడం దండగ అన్నారు. శనివారం కర్నూలు నగరంలో వీర మహిళల సమావేశంలో పాల్గొన్న ఆయన… పార్టీ నేతలు, కార్యకర్తలతో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాయలసీమలో పార్టీ విస్తరణ, బలోపేతం కోసం చేపట్టాల్సిన అంశాలపై కార్యకర్తలు, నేతలతో ఆయన చర్చించారు. అనంతరం నాగబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అలీ వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. దాట వేసారు. అసలు వైఎస్సార్సీపీ ఓ పార్టీనేనా అని నాగబాబు ఎద్దేవా చేశారు. పొత్తులు, పోటీ అంశాలపై పవన్ ప్రకటిస్తారని స్పష్టం చేశారు.
రాయలసీమలో గ్రామ స్థాయి నుంచి పార్టీకి ఆదరణ ఉందన్నారు. జనసేనకు బలమైన కార్యకర్తలు, నేతలు కూడా ఉన్నారని చెప్పారు. పార్టీ కార్యక్రమాలను ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పొత్తులతో పాటు.. ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారన్నారు. పొత్తుల విషయంలో ఊహాగానాలతో మాట్లాడటం సరికాదన్నారు. అధికార పార్టీ దౌర్జన్యాలు, అరాచకాలు, దుర్మార్గం అన్నీ కలిస్తే వైఎస్ఆర్ సీపీ అని అన్నారు. కర్నూలు పర్యటనలో భాగంగా సుగాలి ప్రీతి తల్లిదండ్రులని నాగబాబు కలిశారు. జనసేన అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ దృష్టి పెడతారని హామీ ఇచ్చారు.
ప్రజల తరపున గళం వినిపిస్తోన్న జనసేన నేతలు, సానుభూతిపరులపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని.. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. చట్టాన్ని గౌరవించాల్సిన ప్రజా ప్రతినిధులే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్సు కార్డుల జారీ ఆలస్యం అవుతున్నాయన్న ఆరోపణలను ప్రస్తావిస్తూ… బటన్ నొక్కితే డ్రైవింగ్ లైసెన్స్ కార్డు రాదా సీఎం జగన్ గారూ అంటూ నాదెండ్ల ఎద్దేవా చేశారు. ఏడాది దాటిపోయినా డ్రైవింగ్ లైసెన్స్ కార్డు అందించలేకపోతున్నారంటే మీ పాలన ఎంత గొప్పగా ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. లైసెన్సులు, ఆర్సీ కార్డులకి రూ.76 కోట్లు ఇవ్వలేరా? వస్తున్న ఆదాయాన్ని ముఖ్యమంత్రి ఎటు మళ్లిస్తున్నారని ప్రశ్నించారు.