హైదరాబాద్, ఆంధ్రప్రభ : వేసవిలో అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలను రాష్ట్ర అటవీశాఖ చేపట్టింది. రాష్ట్రంలో ఏడు వేల చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతానికి అగ్ని ప్రమాదం ముప్పు ఉందని ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్టు నివేదిక పేర్కొన్న నేపథ్యంలో అటవీశాఖ అప్రమత్తమైంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు అవకాశం ఉన్నట్లు తెలిపింది. దేశంలోని అడవుల్లో అగ్ని ప్రమాదాల ముప్పు ఉన్న ప్రాంతాలను ముందుగా ఉపగ్రహా చిత్రాల ఆధారంగా గుర్తించి, ఆయా రాష్ట్రాల అటవీ శాఖలకు ఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియా హెచ్చరికలను పంపిస్తుంది. సాధారణంగా ఫిబ్రవరి నుంచి మే మాసం వరకు అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో అడువుల్లో మంటలు చెలరేగడంతో అపారమైన అటవీ సంపద బుగ్గిపాలు కావడం జరుగుతోంది. రాష్ట్రంలో 43 అటవీ రేంజ్‌ల్లో మొత్తం 9,771 కంపార్టుమెంట్ల గాను 1,106 ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉన్నట్లు గతంలోనే గుర్తించారు. ఈ క్రమంలో ఆయా చోట్ల ప్రత్యేకంగా క్విక్ రెస్పాన్ టీంలను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని కంపార్టుమెంట్లలో ఫైర్‌లైన్లు ఏర్పాటు చేస్తూ, అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. ఫైర్ లెన్లు ఏర్పాటు చేయడం వలన అటవీ ప్రాంతాల్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే మంటలను అదుపు చేయడానికి వీలవుతుందని, సమయం కూడా చాల వరకు తగ్గుతుందని అటవీ అధికారులు చెబుతున్నారు. అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉన్న గ్రామస్థులు ఎవరైనా సమీప అడవుల్లో నిప్పు పెట్టడం, జంతువులకు ఉచ్చులు పన్నడం, కరెంట్ తీగలను అమర్చడం అటవీ చట్టరీత్యా నేరమని వారు వెల్లడించారు. అడవిని ఆనుకుని ఉన్న పంటపొలాల్లో గడ్డిని కాల్చడం నిషేదించినట్లు అధికారులు తెలిపారు. అడవుల్లోకి వెళ్ళే పశువుల కాపర్లు తమ వెంట అగ్గిపెట్టలను తీసుకెళ్ళకూడదని, అటవీ మార్గాల వెంబడి సిగరెట్లు, బీడీలను కాల్చడం నేరమని వారు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..