కేరళలో మలప్పురం జిల్లాలో ని పేరింతల్ మన్న టౌన్ లో ఓ యువకుడు నిఫా లక్షణాలతో గత సోమవారం మృతి చెందగా అతని నమూనాలు పూణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. అది నిఫా పాజిటివ్ గా తేలడంతో ఆ వ్యక్తితో గతకొన్ని రోజులుగా సన్నిహితంగా మెలిగిన వారి గురించి కేరళ వైద్యారోగ్య శాఖ ఎంక్వైరీ జరిపించింది. ఏకంగా 157 మందితో మృతుడు సన్నిహితంగా మెలిగినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. తక్షణమే స్పందించిన ప్రభుత్వం మలప్పురం జిల్లాల్లోని పలు పంచాయితీల్లో నిఫా లాక్ డౌన్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో విద్యాసంస్థలు, థియేటర్లు, పార్కులు, పబ్లిక్ ప్రాంతాలన్నీ మూసివేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది. ది. మలప్పురం జిల్లా అంతటా మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో నిఫా ప్రొటోకాల్ నిబంధనలు అమల్లోకి తీసుకు వచ్చింది.
కాగా, నిఫా వైరస్ జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుందని తేలింది. దీన్ని జునోటిక్‌గా పేర్కొంటారు. తొలిసారి నిఫా వైరస్‌ను 1999లో గుర్తించారు. నిఫా ఆతిథ్య జీవుల జాబితాలో పందులు, ఫ్రూట్ బ్యాట్ అనే గబ్బిలాలు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్స్‌లో ఇవి సహజంగానే ఉంటాయి. వాటిపై ఎటువంటి ప్రభావం చూపించలేవు. ఈ గబ్బిలాలు పండ్లపై వాలితే వాటిని తీసుకోవడం ద్వారా వైరస్ మనుషులలోకి ప్రవేశిస్తుంది. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా కూడా ఇతరులకు వైరస్ వ్యాపిస్తుంది.