హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : హైదరాబాద్‌ను వర్షాలు వీడడం లేదు. గత పదిహేను రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోతోంది. ఈ రోజు (గురువారం) హైదరాబాద్‌లో వాన దంచికొట్టడంతో రహదారులపై మురుగునీరు భారీగా చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ, బేగంబజార్, కోటి, అబిడ్స్, మియాపూర్, లిబర్టీ, గచ్చిబౌలి, శంషాబాద్, కొండుపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఆయా జిల్లాల యంత్రాంగం ముందస్తు చర్యలను సిద్ధం చేసుకునే పనిలో పడింది.
మరోవైపు రాగల మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని హెచ్చరించింది. రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్ర, శనివారాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఈనెల 7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.