వాయుగుండంగా బలపడి, తుపానుగా మారేచాన్స్
ఏపీ, తమిళనాడు మధ్య తీరం దాటొచ్చు
హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ
కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు అలర్ట్
ఖరీఫ్ సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలి
ముందస్తు చర్చలు చేపట్టిన ప్రభుత్వం
అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు
ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ:
ఆంధ్రప్రదేశ్ రైతులకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో శనివారం ఏర్పడే అల్పపీడనం క్రమంగా తుపానుగా మారే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు వానగండం పొంచి ఉంది. పంటలు చేతికొచ్చే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఆ తర్వాత రెండ్రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
27న ఏపీ, తమిళనాడు తీరం దాటే చాన్స్
అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం క్రమంగా తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 23వ తేదీన ఏర్పడే అల్పపీడనం తుపానుగా రూపాంతరం చెందిన తర్వాత వచ్చే వారం 27వ తేదీ నాటికి తమిళనాడు, ఏపీలో తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. అల్పపీడనం నేపథ్యంలో కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, వరికోతలు, వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
విపత్తుల నిర్వహణ శాఖ అలర్ట్..
హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో నవంబర్ 23వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, తదుపరి రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మంగళ, బుధవాాారాల్లో (నవంబర్ 26,27తేదీలలో) కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని హెచ్చరించింది.
కలెక్టర్లకు ముందస్తు ఆదేశాలు..
తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సూచించారు. ఖరీఫ్ పంట కోతల సమయం కావడంతో ధాన్యం తడిచిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. భారీ వర్షాలకు నాలుగైదు రోజులు సమయం ఉండటంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.