ఆంధ్రప్రభ స్మార్ట్ – లండన్ – గత కొన్ని రోజులుగా వలస వ్యతిరేక గ్రూపులు బ్రిటన్‌లోని పలు నగరాలు, పట్టణాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. అవి దేశమంతా విస్తరించాయి. ఈ తరుణంలో అక్కడున్న భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ మేరకు లండన్‌లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీని జారీ చేసింది.
”యూకేలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అల్లర్ల గురించి భారత ప్రయాణికులకు తెలిసే ఉంటుంది. లండన్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. భారత్ నుంచి వచ్చే పర్యటకులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాం. స్థానిక మీడియా సంస్థలు, భద్రతా ఏజెన్సీలు ఇచ్చే సూచనలను అనుసరించాలి. నిరసనలు జరుగుతోన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి” అని హై కమిషన్ సూచించింది.
ఆందోళనల వెనుక ..
ఇంగ్లాండ్‌లో కొద్దిరోజుల క్రితం ఓ డ్యాన్స్ క్లాస్‌పై దుండగులు చిన్నారులపై కత్తులతో దాడి చేయడం సంచలనం రేపింది. ఆ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతిచెందడం దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. అది కాస్తా వలస వ్యతిరేక నిరసనలకు దారితీసింది. మాంచెస్టర్, నాటింగ్‌హం, బెల్‌ఫాస్ట్, స్టోక్ ఆన్ ట్రెంట్, బ్లాక్‌పూల్, లీడ్స్, బ్రిస్టల్, హల్, లివర్‌పూల్‌లలో నిరసనల సందర్భంగా ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. రాళ్లు రువ్వడం, బాణసంచా వెలిగించి విసరడం వంటి చర్యలతోపాటు శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న హోటల్‌పై దాడి చేశారు.
ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ప్రధానమంత్రి కీర్ స్టార్మర్.. అధికారులకు పూర్తి మద్దతు తెలిపారు. శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న హోటల్‌పై దాడిని ఖండించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హోం మంత్రి కూపర్ హెచ్చరించారు. కాగా విదేశీయుల భద్రతకు ప్రథమ ప్రాథాన్యత ఇస్తున్నామని వెల్లడించారు..