ఏపీలో జగన్ సర్కారు కొలువై రెండేళ్లు పూర్తి కావొస్తుంది. వైసీపీ 2019 ఎన్నికల్లో ఇచ్చిన ముఖ్యమైన హామీ, నవరత్నాల్లో ఒకటి మద్య నిషేధం. అయితే అధికారంలోకి వచ్చాక ఈ హామీ రూపు మార్చుకుంది. దశల వారీ మద్య నిషేధం అయ్యింది. మద్య నిషేధం చేయడం ముఖ్యం.. అది ఎలా చేస్తే ఏంటిలే అని ఏపీ ప్రజలు భావించారు. కానీ ఇప్పుడు మద్య నిషేధం ఎక్కడి వరకు వచ్చిందంటే అధికారులు నీళ్లు నమలాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మద్యంపై వచ్చే ఆదాయంపైనే ఏపీలో చాలా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని టాక్ నడుస్తోంది.
మద్య నిషేధం గురించి దేవుడెరుగు.. ఉన్న మద్యం తాగి ప్రాణాలు నిలిస్తే చాలు అన్నట్లు ఉంది ఏపీలో పరిస్థితి అని పలువురు చర్చించుకుంటున్నారు. దానికి కారణం బ్రాండ్ల పేర్లు. ఏపీలో విచిత్రమైన పేర్లతో పూటకో బ్రాండ్ పుట్టుకొస్తోంది ఏపీలో. దీంతో సదరు బ్రాండ్ల పేర్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి ఇప్పటికైనా మద్య నిషేధం ఎక్కడి వరకు వచ్చిందో చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. చూస్తుంటే వచ్చే మూడేళ్లలోనూ మద్య నిషేధం అయ్యేలా కనిపించడంలేదని పలువురు విమర్శిస్తున్నారు.