హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాజకీయ పార్టీలన్నింటిని ఒకే వేదికపైకి తీసుకురావడమే అలయ్ బలయ్ లక్ష్యమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ నెల 13న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న అలయ్ బలయ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని దత్తాత్రేయ నేతృత్వంలో సోమవారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కాలం నుండి ప్రతియేటా దసరా సందర్భంగా తాను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానన్నారు. ఈ ఏడాదితో అలయ్ బలయ్‌కు 19 ఏళ్లు పూర్తయిందన్నారు. తెలంగాణ ఉద్యమ పోరాట సమయంలో విడివిడిగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వచ్చి, ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళే ఉద్దేశంతో అలయ్-బలయ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
పరస్పర విబేధాలు లేకుండా అందరూ కలుసుకునే ఆత్మీయ సమ్మేళనమే అలయ్ బలయ్ అన్నారు. అలాగే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, ఆహారపు అలవాట్లను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. అలయ్ బలయ్ కార్యక్రమానికి రావాల్సిందిగా ఇప్పటికే అన్ని పార్టీల ప్రముఖ లీడర్లకు ఆహ్వానాలు పంపామని, ఈ ఏడాది అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు- చేశామని వెల్లడించారు. అందరినీ కలుపుకొని పోవడమే అలయ్ బలయ్ ఉద్దేశమని ఆయన పునరుద్ఘాటించారు.