సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కోవిడ్-19 వ్యాక్సిన్ విషయంలో యూ టర్న్ తీసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఆయన మాట్లాడుతూ.. తాను కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోబోనని, అది భారతీయ జనతా పార్టీ వ్యాక్సిన్ అని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోదీ ప్రకటన నేపథ్యంలో మంగళవారం అఖిలేష్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ, తాను ఈ వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పారు. అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని పిలుపునిచ్చారు.
అఖిలేష్ మంగళవారం ఇచ్చిన ట్వీట్లో.. కోవిడ్-19 వ్యాక్సిన్ తానే అందజేస్తానని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. ప్రజాగ్రహాన్ని కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకుందన్నారు. ఈ వ్యాక్సిన్‌పై రాజకీయాలు చేయకుండా చివరికి ఈ నిర్ణయం తీసుకుందన్నారు. తాము బీజేపీ వ్యాక్సిన్‌కు వ్యతిరేకమని, భారత ప్రభుత్వ వ్యాక్సిన్‌ను స్వాగతిస్తామని చెప్పారు. తాను వ్యాక్సిన్ వేయించుకుంటానని, వ్యాక్సిన్ కొరత వల్ల టీకాను తీసుకోలేకపోయినవారంతా టీకాను తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ సోమవారం జాతినుద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వమే సమకూర్చుతుందని తెలిపారు. దేశంలోని వయోజనులందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ చేస్తామన్నారు. కాగా ఇప్పటికే అఖిలేష్ తండ్రి, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.