తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో నేడు ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ దివంగత నేత వైఎస్ఆర్ ప్రస్తావన తీసుకువచ్చారు. వైఎస్ గొప్ప మనసున్న నేత అని, ప్రజల సమస్యలను ఆయనకు నివేదిస్తే వెంటనే పరిష్కరించేవారని తెలిపారు. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ ప్రజలకు ఆయన శ్రేయోభిలాషి అని పేర్కొన్నారు.
‘నా జీవితంలో నేను అభిమానించే అతి కొద్దిమంది నేతల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. ఆయన ముస్లింలకు, మైనారిటీలకు స్నేహితుడు. బాబా షర్ఫుద్దీన్ పహాడీ దర్గా భూముల పరిస్థితిపై నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేను ఆక్రోశించాను. నా ఆవేదనను వైఎస్ అర్థం చేసుకున్నారు. అక్బర్… ఆవేశపడకుండా మీ సమస్య ఏంటో చెప్పండి అన్నారు. దాంతో దర్గా స్థలాల పరిస్థితిని ఆయనకు గణాంకాలతో సహా వివరించాను. అక్బర్ చెప్పింది సబబుగా ఉంది అంటూ ఆయన జీవో జారీ చేశారు. ఆ 85 ఎకరాల స్థలాన్ని కబ్జాల నుంచి రక్షించి, వక్ఫ్ బోర్డుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు’ అని వివరించారు. వైఎస్ఆర్ వంటి నాయకుడిని తన జీవితంలో చూడలేదని, ముస్లింలు, మైనారిటీలు ఆయనను తమ జీవితంలో మర్చిపోలేరని అక్బరుద్దీన్ పేర్కొన్నారు.