మహా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ చవాన్ కాంగ్రెస్‌కి రాజీనామా చేయడంలో వ్యక్తిగత ప్రయోజనం ఉండవచ్చు. ఆయన రాజీనామా వల్ల ఆ పార్టీకీ, ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎదురుదెబ్బంటూ వార్తలు వచ్చాయి.సాధారణంగా పెద్ద నాయకుడు పార్టీ మారినప్పుడల్లా ఇలాంటి కథనాలు వెలువడుతుంటాయి. కానీ,అశోక్ చవాన్ విషయం ఆలోచిస్తే ఆయన మహారాష్ట్రలో పార్టీకి చేసింది పెద్దగా ఏమి లేదు.
పైగా, ఆయన హయాంలో చోటు చేసుకున్న ఆదర్శ హౌసింగ్ సొసైటీ కుంభకోణం వల్ల ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వంపైనా, కాంగ్రెస్ పార్టీపైనా మచ్చ పడింది.ఆయన మాదిరిగా మహారాష్ట్రలో మరో ఇద్దరు ప్రముఖ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగి అజిత్ పార్టీలోనూ, ఏకనాథ్ షిండే పార్టీలోనూ చేరనున్నట్టు వార్తలు వచ్చాయి. అశోక్ చవాన్ కూడా బీజేపీలో చేరుతారనీ,రాజ్యసభ టికెట్ ఇస్తామన్న పిలుపుతోనే ఆయన కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారంటూ వార్తలు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికలు, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. కనుక, ఎన్నికల లోపు ఇంకా చాలా మంది గోడదూకే అవకాశం ఉందంటున్నారు.వీరందరూ వ్యక్తిగత అజెండాతో ఎంతో కాలంగా తమను ఆదరించిన పార్టీకి గుడ్‌బై చెబు తున్నారు. వీరిలో మిలింద్ దేవరా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడన్న పేరుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే మాదిరి పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఆర్‌ఎల్‌డి ఇండియా కూటమి నుంచి వై దొలగి ఎన్‌డిఏ చేరారు. ఆర్‌ఎల్‌డి వ్యవస్థాపకుడు అజిత్ సింగ్ బీజేపీకి వ్యతిరేక పంధాని అనుసరించేవారు. అజిత్ సింగ్ తండ్రి చరణ్ సింగ్‌కి కేంద్రం ఇటీవల భారత రత్న పురస్కారాన్ని ప్రక టించింది.
ఆ ప్రకటన, ఆర్‌ఎల్‌డి వైదొలగడం రెండూ ఒకేసారి జరగడం వల్ల చరణ్‌సింగ్‌కి భారత రత్న ఇవ్వడం వల్లనే ఆ పార్టీ ఎన్‌డిఏలో చేరినట్టు ప్రచారం జరిగింది. కొత్తగా చేరిన వారితో బీజేపీ,దాని నేతృత్వం లోని ఎన్‌డి ఏ కూటమి బరువు ఎక్కువైన పడవలా తయారవుతుందేమోనన్న సందేహాలు వ్యక్తం అవుతు న్నాయి. అయితే, అయోధ్యలో రామాలయం నిర్మాణం సాకారం కావడంతో బీజేపీ పట్ల జనాకర్షణ ఉందన్న మాట వినిపిస్తోంది. గతంలో ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ యుద్ధంలో విజయం సాధించినప్పుడు, ఆమెహత్యా నంతరం జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌లొకి ఇదే మాదిరిగా భారీ ఎత్తున చేరికలు ఉండేవి.కాంగ్రెస్ ముక్త భారత్ (కాంగ్రెస్ లేని భారత్) బీజేపీ లక్ష్యమే కావచ్చు, కానీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారినే చేర్చుకోవడం వల్ల ఆ పార్టీకి ప్రయోజనకరమన్న ప్రశ్న తలెత్తుతోంది. మధ్యప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ లోకి క్యూ కట్టేందుకు పలువురు ప్రతిపక్ష ఎంపీలు సిద్ధంగా ఉన్నారు. వీరందరికీ గేట్లు తెరిస్తే, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ల పంపిణీ క్లిష్టతరమవుతుంది. ఇప్పటికే, చాలా చోట్ల ఒకే స్థానానికి ఇద్దరు,ముగ్గురు పోటీ పడుతున్నారు. రాజకీయాల్లో ఏ పార్టీ అధికారం లో ఉంటే, అందులో చేరడం విశేషమూ కాదు, అసాధా రణమూ కాదు.
ఎవరిని పడితే వారిని ఆహ్వానించి అక్కున చేర్చుకోవడం వల్ల వచ్చే ప్రమాదాన్ని బీజేపీ పెద్దలు గుర్తించాలి.చేర్చుకునేటప్పుడు బాగానే ఉంటుంది. అది బలుపు కాదు, వాపు అన్న సంగతి తర్వాత తెలుస్తుంది. బీజేపీలో ఇప్పటికే కాంగ్రెస్ సంస్కృతి వచ్చి చేరిందన్న మాటలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో అప్రదిష్టపాలైన వారిని చేర్చుకోవడం వల్ల తమ పార్టీకి ఏమంత మేలో కమలనాథులు ఆలోచించాలి. పార్టీ అగ్రనాయకుల దృష్టికి రాకుండానే, రాష్ట్ర స్థాయిలో ఈ చేరికలు, కూడికలు జరుగుతున్నట్టు భోగట్టా. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తరచూ ప్రకటించే 370 స్థానాల సంఖ్యను చేరుకునే అవకాశం ఇప్పటికే ఉంది కనుక, ఇక పైన ఆయారామ్‌లకు పార్టీ తీర్థం ఇచ్చే ముందు అన్ని కోణాల్లో ఆలోచించడం అత్యవసరం. ఎన్నికల షెడ్యూ లు ప్రకటన తర్వాత ఈ చేరికలు ఇంకా భారీ ఎత్తున ఉండవచ్చు. చాలా రాష్ట్రాల్లో అధికార పార్టీల్లోకి ప్రతి పక్షాల ఎమ్మెల్యేలు చేరడం కోసం తెరవెనక సంప్రదింపు లు జరుపుతున్నారు.
అయితే గతంలో మాదిరిగా వేటు పడుతుందేమోనని కొందరు వెనక్కి తగ్గుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది. రాజ్యసభ ఎన్నికలకు బలాన్ని సమకూర్చుకోవడానికి ఫిరాయింపు లను అధికారంలో ఉన్న పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికలకు ఎమ్మెల్యేల సంఖ్య సరిపోని రాష్ట్రాల్లోనే అధికార పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహి స్తున్నాయి. మహరాష్ట్రలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ రాజ్యసభ టిక్కెట్టు ఆశించి పార్టీ ఫిరాయించినట్టు సమాచారం. అలాగే ఎన్సీపీ అజిత్, ఉద్ధవ్ వర్గాలు కూడా ఈ మాదిరిగా ప్రత్యర్థి శిబిరాల నుంచి ఎమ్మెల్యేల ను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నాయి.