కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ ఇన్‌చార్జి పదవికి ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ రాజీనామా చేశారు. ఇటీవల రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు మద్దతుగా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై ఇంతవరకూ పార్టీ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారని, ఆ కారణంగానే పార్టీ పదవికి రాజీనామా చేశారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాసినట్టు తెలుస్తోంది. రాజస్థాన్‌లో రాజకీయ అస్థిరతకు చరమగీతం పాడాలంటూ రెండు వారాల క్రితం సచిన్ పైలట్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాజాగా అజయ్ మాకెన్ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రాజస్థాన్‌లోని వచ్చే నెల ప్రారంభంలో భారత్ జోడో యాత్ర రానుండటం, డిసెంబర్ 4న ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని రాజస్థాన్‌కు సాధ్యమైనంత త్వరగా కొత్త ఇన్‌చార్జిని నియమించాలని మల్లికార్జున్ ఖర్గేకు రాసిన లేఖలో అజయ్ మాకెన్ కోరినట్టు తెలుస్తోంది. 40 ఏళ్లుగా కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకుగా ఉన్న తనకు రా#హుల్ పట్ల పరిపూర్ణ విశ్వాసం, అభిమానం ఉన్నాయని చెప్పారు. ఢిల్లిdలోని ట్రేడ్ యూనియన్లు, ఎన్జిdవోలపై తాను పూర్తి దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నట్టు అజయ్ మాకెన్ ఆ లేఖలో ఖర్గేకు విన్నవించారు.