న్యూఢిల్లిd : ప్రముఖ టెలికాం దిగ్గజ కంపెనీ.. ఎయిర్‌టెల్ తన నెట్‌వర్క్‌ను విస్తృతం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎయిర్ కంపెనీ కొన్ని కీలక లక్ష్యాలను వివరించింది. రాబోయే ఐదేళ్ల కాలంలో.. రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించినట్టు తెలిపింది. తన అనుబంధ సంస్థలు అయిన ఇండస్ టవర్స్, ఎన్‌ఎక్స్‌ట్రా, భారతీ హెక్సాకామ్‌తో ఆ మేరకు వ్యాపార లావాదేవీలను నిర్వహించనున్నట్టు తెలిపింది. మరోవైపు ఫిబ్రవరి 26న ఎయిర్‌టెల్ బోర్డు భేటీ కానుంది. ఇప్పటికే ఎయిర్‌టెల్ తనలోని 1.25 శాతం వాటాను గూగుల్‌కు విక్రయించింది. దీని విలువ రూ.7,500 కోట్లుగా ఉంది. ఈ వాటా విక్రయానికి బోర్డు కూడా ఆమోదం తెలిపింది. ఐదేళ్లలో రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడుల్లో ఏ రంగానికి ఎంత ఖర్చు చేయడానికి నిర్ణయించారో వివరించింది.
ఇండస్ టవర్స్ కోసం రూ.88వేల కోట్లు..
ఇండస్ టవర్స్ కోసం రూ.88వేల కోట్లు, డేటా సెంటర్ అయిన ఎన్‌ఎక్స్‌ట్రా నుంచి సేవల కోసం రూ.15వేల కోట్లు, భారతీ హెక్సాకామ్‌తో లావాదేవీలకు రూ.14వేల కోట్లు ఖర్చు పెట్టనుంది. ఈ మూడింట్లో టవర్స్‌పైనే ఎక్కువ మొత్తం ఖర్చు చేయడానికి నిర్ణయించినట్టు తెలిపింది. ప్రస్తుతం 5జీ సేవలు ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభం అవుతున్నాయి. భారత్‌లోనూ త్వరలో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులు చకచకా సాగిపోతున్నాయి. భారత్‌లో 5జీ సేవలు ముందుగా నగరాల్లో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నది. ఆ తరువాతే.. దేశమంతటా విస్తరింపజేయాలని నిర్ణయించినట్టు ఎయిర్‌టెల్ కంపెనీ ప్రతినిధులు వివరించారు. 5జీ సేవల విస్తరణలో భాగంగా.. ఏడాదికి దాదాపు రూ.20వేల కోట్ల చొప్పున.. 2025-26 వరకు ఖర్చు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..