ప్రముఖ మొబైల్ కంపెనీ ఎయిర్టెల్ 5జీ సేవల్లో నెలరోజుల్లోనే ఓ మైలురాయిని చేరుకుంది. తమ కంపెనీ 5జీ సేవల్లో 10 లక్షల మంది యునిక్ యూజర్లు భాగమయ్యారని ఎయిర్టెల్ ప్రకటించింది. 5జీ సేవలు ప్రారంభించిన నెల రోజుల్లోనే తాము ఈ ఘనత సాధించామని తెలిపింది. హైదరాబాద్, ఢిల్లి, ముంబై, చెన్నయ్, బెంగళూర్, సిలిగుడి, నాగ్‌పూర్, వారణాసి నగరాల్లో తొలి దశగా ఎయిర్టెల్ 5జీ సేవలను ప్రారంభించింది. ఈ నగరాల్లో దశలవారిగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నారు. ఎయిర్టెల్ 5జీ సేవలను విస్తరిస్తూ ముందుకెళుతున్నామని కంపెనీ సీటీఓ రణ్‌దీప్ సెకాన్ తెలిపారు.
కొన్ని డివైజలు మినహాయిస్తే అన్ని పరికరాల్లో తమ 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. దేశవ్యాప్తంగా సేవలందించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకు నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నామని ఆయన వివరించారు. సేవలు ప్రారంభించిన కేవలం నెలరోజుల్లోనే ఈ స్థాయిలో స్పందన రావడం తమకు ప్రోత్సహకరంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం వినియోగదారులు వినియోగిస్తున్న ప్లాన్లతోనే హైస్పీడ్ 5జీ సేవలు అనందించవచ్చని ఎయిర్టెల్ తెలిపింది. ఇందుకోసం సిమ్ కార్డును మార్చాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. 5జీని సపోర్టు చేసే మొబైల్ ఉంటే ఈ సేవలను పొందవచ్చని ఎయిర్టెల్ స్పష్టం చేసింది.