హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఎయిర్‌పోర్టు మెట్రో రైలు ప్రాజెక్టుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్(హెచ్‌ఏఎంఎల్) త్వరలో టెండర్లు పిలవనుంది. డిసెంబరు 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న ఈ నూతన మెట్రో కారిడార్ నిర్మాణాన్ని హెచ్‌ఏంఎంల్ ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్(ఈపీసీ) పద్ధతిలో చేపట్టనున్నట్లు సమాచారం. రూ.6 వేల250 కోట్లు ఖర్చవనున్న ఈ ప్రాజెక్టు వ్యయాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించనుంది. దీంతో ప్రభుత్వమే ఈ నూతన మెట్రో కారిడార్‌ను టెండరు పద్ధతిలో నిర్మించుకోవాల్సి ఉంటుంది. గతంలో మెట్రో రైలు మొదటిదశను ఎల్‌అండ్‌టీ బీవోటీ పద్ధతిలో నిర్మించి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా చేపడుతున్న ఎయిర్‌పోర్టును బీవోటీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే సొంత నిధులతో చేపడుతున్నందున సాధారణ పనుల్లానే ఈ ప్రాజెక్టుకు టెండర్లను పిలవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తొలిదశ మెట్రోరైలులో భాగంగా నగరానికి పశ్చిమాన ఐటీ కారిడార్‌లో ఉన్న రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి నానాక్‌రామ్‌గూడ మీదుగా అవుటర్ రింగు రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కారిడార్ నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టును 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
బీవోటీ పద్ధతిలో కాంట్రాక్టు కంపెనీల అనాసక్తి…
నిర్మించి నిర్వహించే పద్ధతిలో కాంట్రాక్టు కంపెనీలు అంత త్వరగా ముందుకు రావనే కారణంగానే ప్రభుత్వం సొంత నిధులతో టెండర్లు పిలిచి ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రో నిర్మించడానికి నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్(హెచ్‌ఎంఆర్‌ఎల్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఇప్పటికే సేవలందిస్తున్న మెట్రోరైలు ఆర్థిక పరంగా అంతగా విజయం సాధించలేదని ప్రచారం జరుగుతున్నందునే కంపెనీలు బీవోటీ పద్ధతిలో ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు రాకపోవచ్చని అంచనా వేసినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ప్రభుత్వమే సొంత వనరులతో హైదరాబాద్‌లో ప్రజారవాణా అవసరాలకు అత్యవసరమైన ఎయిర్‌పోర్టుకు మెట్రోను వేగంగా నిర్మించాలని నిర్ణయించినట్లు సమాచారం.
హెచ్‌ఏఎంఎల్ ద్వారా రుణాలు…
హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ ద్వారా ప్రభుత్వం నిర్మించనున్న ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి హెచ్‌ఏఎంఎల్ ద్వారా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి రుణాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది. రానున్న 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు కొంత వరకు ఈక్విటీ నిధులు కేటాయించి మిగతా వాటిని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందనున్నట్లు సమాచారం. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వచ్చే ఆదాయం నుంచి తీసుకున్న రుణాలకు వడ్డీని, రుణాలను తిరిగి చెల్లించవచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.