ఒంగోలు, ప్రభన్యూస్ బ్యూరో : విజయవాడ- ఒంగోలు 16వ నెంబర్ జాతీయ రహదారిపై నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఈ నెల 29వ తేది విమాన ల్యాండింగ్ ట్రయల్‌రన్ నిర్వహించనున్నారు. బాపట్ల జిల్లా రేణింగివరం, కొరిశపాడు మధ్య నిర్మించిన ఎయిర్ ప్యాడ్ జాతీయ రహదారుల పై విమానాల అత్యవసర ల్యాండింగ్‌కు అవసరమైన 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం వరకు రహదారిని నిర్మించారు. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు భారత వైమానికి దళానికి ( ఐఏఎఫ్) చెందిన ఓ కార్గో విమానం, రెండు ఫైటర్‌జెట్ యుద్ద విమానాలు జాతీయ రహదారి పై అత్యవసరంగా ల్యాండింగ్ కానున్నాయి. హైవే పై అత్యవసర సమయాల్లో విమానాలు దిగేందుకు వీలుగా ప్రత్యేకంగా రోడ్డును నిర్మించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో విమానాశ్రయాల నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించే సమయం తగ్గుతుందని చెప్పారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారుల సాంకేతిక పర్యవేక్షణతో..నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్టూరు, సింగరాయకొండ వద్ద జిల్లా కేంద్రమైన ఒంగోలు నుండి 30-35 కిలోమీటర్ల దూరంలో రెండు ఎయిర్ స్ట్రిప్‌లను నిర్మించింది. దేశ వ్యాప్తంగా 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో విజయవాడ – ఒంగోలు మధ్యలోని రేణంగివరం వద్ద, ఒంగోలు- నెల్లూరు మధ్య సింగరాయకొండ వద్ద జాతీయ రహదారిని ల్యాండింగ్‌కు అనువుగా అభివృద్ది చేశారు. 2017 అక్టోబర్ లో తొలిసారిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఫైటర్ జెట్లు, రవాణా విమానాలను లక్నో- ఆగ్రా ఎక్స్‌ప్రెస్ మార్గం పై ప్రయోగాత్మకంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు. దేశ వ్యాప్తంగా ఈ తరహా సదుపాయాలను మెరుగుపరుస్తూ వస్తున్నారు. వరదలు, భూకంపాలు లాంటి ప్రకృతి విపత్తులు సంబంవించిన సందర్భంగా ఈ ఎయిరన్ స్ట్రిప్‌లను ఉపయోగించుకోనున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన బాపట్ల కలెక్టర్..
జాతీయ రహదారి పై నిర్మించిన ఎమర్జెన్సీ ఎయిర్ క్రాప్ట్ ల్యాండింగ్ ప్రాంతాన్ని మంగళవారం బాపట్ల కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింటు కలెక్టర్ శ్రీనివాసులు, భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ ఎస్.చౌదరిలు పరిశీలించారు. ఈ నెల 29వ తేది రేణంగివరం వద్ద యుద్ధ విమానాలు ల్యాండింగ్ కానున్న నేపథ్యంలో అధికారులు అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.