పైలట్లు అంటే ఎంతో అప్రమతంగా ఉండాలి. వేల అడుగుల ఎత్తులో విమానాలు ఎగురుతున్నప్పుడు ఎంతో జాగ్రత్త వహించాలి. అయితే ఇద్దరు పైలట్లు ఆకాశంలో విమానం వెళ్తున్నప్పుడు గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈటీ343 విమానం సూడాన్‌లోని ఖార్టూమ్ నుంచి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాకు బయలుదేరింది. ఆ విమానం 37,000 అడుగుల ఎత్తులో ఆకాశంలో ప్రయాణించింది. అయితే విమానాన్ని ఆటో పైలట్ మోడ్‌లో ఉంచి ఇద్దరు పైలట్లు నిద్రపోయారు. కాగా ఈ విమానం అడిస్ అబాబాలోని ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. పైలట్లు నిద్రలో ఉండటంతో విమానం అక్కడ ల్యాండ్ కాలేదు.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అప్రమత్తం చేసినప్పటికీ నిద్రలో ఉన్న పైలట్లు స్పందించలేదు. దీంతో ఆ విమానం ఎయిర్‌పోర్ట్‌ను దాటి వెళ్లింది. అనంతరం ఆటో పైలట్ మోడ్ ఆఫ్ కావడంతో అలారమ్ మోగింది. దీంతో మేల్కొన్న ఇద్దరు పైలట్లు ఆ విమానం ఎయిర్‌పోర్ట్‌ను దాటినట్లు గ్రహించారు. దానిని వెనక్కి మళ్లించి రన్‌వేపై ల్యాండ్ చేశారు. దీంతో విమానం సుమారు 25 నిమిషాలు ఆలస్యంగా ఆ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది.ఈ సంఘటన నేపథ్యంలో ఆ విమానం రెండున్నర గంటల తర్వాత అక్కడి నుంచి తదుపరి గమ్యస్థానానికి టేకాఫ్ అయ్యింది. అయితే వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానంలో పైలట్లు నిద్రపోయిన వైనంపై విమానయాన నిఫుణులు ఆందోళన వ్యక్తం చేశారు.