ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఎయిర్‌బస్ సీ295 ట్రాన్స్‌పోర్టు ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. వడోదరలో దీన్ని నెలకొల్పనున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. ఈ తయారీ
కేంద్రానికి అక్టోబర్ 30న ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారని ఆయన తెలిపారు. యూరప్ బయట సి-295 విమానాలను తయారు చేయడం ఇదే తొలిసారి అని అజయ్ కుమార్ తెలిపారు. భారత వైమానిక దళంలో పాత ఎవిరో 748 విమానాల స్థానంలో ఎయిర్‌బస్‌కు చెందిన సి-295 విమానాలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు.
ఇందుకోసం 56 విమానాలను అందించేందుకు ఎయిర్‌బస్‌తో 21 వేల కోట్లకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా వచ్చే నాలుగేళ్లలో 16 విమానాలను ఎయిర్‌బస్ భారత్‌కు అందించనుంది. మిగిలిన 40 విమానాలను టాటా గ్రూప్‌కు చెందిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్(టీఏఎస్‌ఎల్) తయారీ, అసెంబ్లింగ్ చేపడుతుంది. ఈ ఒప్పందానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ గత వారం ఆమోదం తెలిపింది.