దక్షిణ గాజాలో జనావాసాలపై ఇజ్రాయెల్ శనివారం జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 32 మంది పాలస్తానీయులు మరణించారని అధికారులు తెలిపారు. ఖాన్ యూనిస్‌లో జనసమ్మర్థంతో కిటకిటలాడుతుండే ప్రాంతంలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో రెండు అపార్ట్‌మెంట్లపై ఇజ్రాయెల్ ఉన్నపళంగా జరిపిన వైమానిక దాడుల్లో 26 మంది మరణించారని, మరో 23 మంది గాయపడ్డారని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.
డెయిల్ అల్ బలాలో ఒక ఇంటిపై గగనతలం నుంచి జరిపిన దాడిలో ఆరుగురు పాలస్తానీయులు మరణించారని తెలిపారు. దక్షిణ గాజా నుంచి వెళ్లిపోవాల్సిందిగా అక్కడి పౌరులను హెచ్చరించిన అనంతరం ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ హెచ్చరికతో 4 లక్షలకు పైగా జనాభా కలిగిన ఖాన్ యూనిస్ నగర పౌరులతో పాటుగా దక్షిణ గాజాలో పాలస్తానీయులు కట్టుబట్టలతో ఇళ్లను ఖాళీ చేసి తరలిపోవడం అత్యంత దారుణమైన మానవ సంక్షోభానికి దారి తీస్తుంది.
ఇప్పటికే లక్షలాదిగా ప్రజలు వెళ్ళిపోయారని అధికారులు వెల్లడించారు. ఇదే విషయమై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అనుచరుడు మార్క్ రెగెవ్ మాట్లాడుతూ ”దక్షిణ గాజా నుంచి వెళ్ళిపోవాల్సిందిగా ప్రజలను కోరాం. వారిలో చాల మందికి అది అంత సులభం కాదని నాకు తెలుసు. కానీ కాల్పుల మధ్య ప్రజలు చిక్కుకోవడాన్ని మేం చూడాలనుకోవడంలేదు” అని అన్నారు. గాజాలో మృతుల సంఖ్య 12,000 దాటిపోయిందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మరణించినవారిలో 5,000 మంది చిన్నారులు ఉన్నారని చెప్పారు.