న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఉడాన్ స్కీమ్ కింద విమానాలు నడిపేందుకు ఆంధ్రప్రదేశ్లోని కడప, కర్నూలు, ప్రకాశం బ్యారేజీ వాటర్ ఏరోడ్రోమ్లను గుర్తించామని కేంద్రం తెలిపింది. కడప, కర్నూలు నుంచి ఇప్పటికే ఉడాన్ విమానాల రాకపోకలు సాగుతున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీలు చింతా అనురాధ, బెల్లాన చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాతపూర్వక సమాధానమిచ్చారు.
ప్రకాశం బ్యారేజీ ఏరోడ్రోమ్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని అన్నారు. అక్కడ ప్రీ-ఫీజిబిలిటీ స్టడీ కూడా పూర్తయిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉడాన్ పథకం కింద మొత్తం 28 రూట్లలో విమాన సర్వీసులు నడుస్తున్నాయని చెప్పారు. ఉడాన్ అనేది ఇప్పటికే కొనసాగుతున్న పథకమని, సమయానుకూలంగా బిడ్డింగ్ రౌండ్లు నిర్వహించి, కొత్త విమాశ్రయాలు, కొత్త రూట్లను చేర్చడం జరుగుతుందని కేంద్రమంత్రి తెలిపారు.