ప్రభ న్యూస్, హైదరాబాద్: భాగ్యనగ రంలో వాహనాల వాడకం పెరుగుతోంది. ప్రతిఒక్కరు సొంత వాహనాలను ఉపయోగిస్తున్నారు. నగర జనాభాతో పాటే వెహికిల్స్ కూడా పెరుగుతూ పోతున్నాయి. అయితే కాలం చెల్లిన వాహనాలను తొలగించకుండా వాడుతుండటంతో కాలుష్యం పెరుగుతోంది. నగరంలో నిత్యం 55 లక్షల పై చిలుకు వాహనాలు నగర రోడ్లపై తిరుగుతున్నాయి. దీంతో వాహన కాలుష్యం అంతకంతకు పెరుగుతూ పోతుంది. వీటికితోడు పాత వాహనాలే దాదాపు 10 లక్షల వెహికిల్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించినా రోడ్లపై తిరగకుండా చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలం అయ్యారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రోడ్లపై నిత్యం రద్ధీ
నగరంలో కేవలం ప్రజా రవాణాకై ఒక ఆర్టీసీ బస్సులే 3750 వరకు ఉపయోగిస్తున్నారు. దాదాపు 13,000 స్కూల్, కాలేజీల బస్సులు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే రోజుకు 109.5 కోట్ల లీటర్ల పెట్రోల్‌ను వినియోగిస్తున్నారు. ఇక 120.45 కోట్ల లీటర్ల డీజిల్ ఒక రోజుకు ఉపయోగిస్తున్నారు. నగరం మొత్తం 7000 కిలో మీటర్ల పరిధి ఉండగా సగటున గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఉదయం, సాయంత్రం రోడ్లపై రద్ధీ ఎక్కువగా ఉండటంతో ఇందనం వాడకం పెరుగుతోంది.
ఆ సమయాల్లో వాహనాల్లో నుంచి కార్భన్‌మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, అమోనియా, బెంజిన్ లాంటి ఉద్గారాలు వెలువడుతాయి. ఆ కలుషితం అయిన గాలిని వెంటనే అక్కడే ఉన్న వాహనదారులు పీల్చుతూ అనారోగ్యం బారిన పడేలా చేస్తోంది. ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు.
రోడ్లపై కాలం చెల్లిన వాహనాలు
పొల్యూషన్ ఎక్కువగా కాలం చెల్లిన వెహికిల్స్ నుంచి వెలువడుతుం దని అధికారులు తెలుపుతున్నారు. నగరంలో 15 ఏళ్లు పైబడిన వాహనాలు 10 లక్షలకు పైగా ఉన్నట్లు గుర్తించారు. వాటిని తుక్కుగా మార్చాల్సింది పోయి వాటితోనే ప్రయాణిస్తుండటంతో పొల్యూషన్ పెరుగుతూ పోతుంది. వాటిని నగర రోడ్లపై తిరగకుండా చూడాల్సిన పోలీసులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సైతం తమకు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందుగా కాలం చెల్లిన వాహనాలను రోడ్లపై తిరగకుండా అడ్డుకోకుండా నిర్లక్ష్యం వహించడంతో పొల్యూషన్ పెరుగుతూ పోతుందని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా మేల్కొని చర్యలు ప్రారంభించాలని కోరుతున్నారు.
తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగిం చుకోవాలి
- అందరికి అందుబాటులోకి ప్రజారవాణా ఉండాలి
- సీఎన్జీ వెహికిల్స్ ఉపయోగం పెరగాలి
- బిఎస్ 6 వెహికిల్స్ వినియోగంలోకి తేవాలి
- ఇందనం కల్తీ కాకుండా అడ్డుకట్ట వేయాలి
అందరికి అందుబాటులో ప్రజారవాణా లేకపోవడంతో సొంత వాహనాల వాడకం పెరుగుతోంది. ట్రాఫిక్ రద్ధీతో 10 నిమిషాల్లో వెళ్లాల్సి ఉండగా 30 నిమిషాల సమయం తీసుకోవడంతో సొంత వాహనాలను వాడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముందుగా ప్రభుత్వం ప్రజా రవాణాను మెరుగు పరచాలి. ట్రాఫిక్ రద్ధీని తగ్గించాల్సిన అవసరం ఉందని నగర వాసులు కోరుతున్నారు. నగరంలో ఇందన కల్తీ కూడా పొల్యూషన్‌కు కారణంగా మారుతోంది. ఇందన కల్తీతో వాహనాల నుంచి వచ్చే పొల్యూషన్ తీవ్రత పెరుగుతోంది. దాదాపుగా చాలా బంకుల్లోనే కల్తీ పెట్రోల్‌ను వాహనాల్లో పోస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ కల్తీని అరి కట్టేందుకు అధికారులు దృష్టి పెట్టాలని నగరవాసులు వేడుకుంటున్నారు.