టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా మొత్తం 840 విమానాల కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందులో మొదటి దశలో 470 విమానాల కొనుగోలుకు స్థిరమైన ఆర్డర్ ఇచ్చింది. మిగిలిన 370 విమానాల కొనుగోలు ఆఫ్షన్‌గా పెట్టుకున్నట్లు ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫీసర్ (సీసీటీఓ) నిప్పన్ అగర్వాల్ చెప్పారు. ఎయిర్‌బస్ నుంచి 250, బోయింగ్ నుంచి 220 విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చినట్లు మంగళవారం నాడు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఒకే సారి ఇంత భారీ స్థాయిలో విమానాలకు ఆర్డర్ ఇవ్వడం ఇదే తొలిసారి. ఆఫ్షన్‌గా పెట్టుకున్న 370 విమానాలను వచ్చే 10 సంవత్సరాల్లో బోయింగ్, ఎయిర్‌బస్ నుంచి కొనుగోలు చేసే హక్కును ఎయిర్ ఇండియా కలిగి ఉంటుందని నిప్పన్ అగర్వాల్ చెప్పారు.
ఎయిర్‌బస్‌కు ఇచ్చిన ఆర్డర్లో 210 విమానాలు ఏ320, 321 నియో ఎక్స్ఎల్ఆర్ విమానాలు, 40 విమానాలు ఏ 350-900-1000 ఉన్నాయని ఆయన వివరించారు. బోయింగ్‌కు ఇచ్చిన ఆర్డర్లో 190 విమానాలు బీ737 మ్యాక్స్, 20 విమానాలు బీ 787 ఎస్, 10 విమానాలు బీ777 ఎస్ ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు విమానాల ఇంజిన్స్ నిర్వాహణ ఒప్పందాన్ని సీఎఫ్ఎం ఇంటర్నేషనల్, రోల్స్‌రాయిస్, జీఈ ఎయిరోస్పేస్తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.
ఆర్డర్ ఇచ్చిన విమానాలు ఎప్పుడు డెలివరీ అవుతాయన్న విషయాన్ని ఎయిర్ ఇండియా వెెల్లడించలేదు. ఏ350ఎస్ విమానాలను ఎయిర్‌బస్ ఈ సంవత్సరం నుంచే డెలివరీ చేయడం ప్రారంభిచనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఏ320 నియో ఫ్యామిలీకి చెందిన విమానాల డెలివరీ 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏ350ఎస్, బీ777ఎస్ విమానాలను ప్రధానంగా నార్త్ అమెరికా రూట్లో ఎయిర్ ఇండియా నడపనుంది. బీ787ఎస్ విమానాలను కూడా ఇతర దూర ప్రాంతాలకు నడపనుంది. దూర ప్రాంతాలకు వైడ్ బాడీ విమానాలను వినియోగిస్తారు. కొన్ని ఇంటర్నేషనల్ రూట్స్‌లోనూ నారో బాడీ విమానాలను ఎయిర్ ఇండియా నడపనుంది.
కాక్‌పిట్, క్యాబిన్ సిబ్బంది శిక్షణ కోసం ఎయిర్ ఇండియా త్వరలోనే ఒక అకాడమీని నెలకొల్పనుంది. కొత్తగా కొనుగోలు చేయనున్న విమానాల్లో ఇక్కడ శిక్షణ పొందిన సిబ్బందిని నియమించుకోనున్నారు. 840 విమానాలకు ఆర్డర్ ఇవ్వడం ఎయిర్ ఇండియాతో పాటు, భారత విమానయాన రంగంలో అత్యంత కీలకమైన, ప్రధానమైన ఘట్టమని నిప్పన్ అగర్వాల్ చెప్పారు. ఎయిర్ ఇండియాను వరల్డ్ క్లాస్ ఎయిర్‌లైన్స్‌గా మార్చాలన్నది యాజమాన్యం లక్ష్యమని చెప్పారు. ప్రపంచంలోని ప్రతి ముఖ్యమైన నగరానికి ఇండియా నుంచి నాన్ స్టాప్ విమానాలను నడపాలని భావిస్తున్నామని చెప్పారు.