ఎయిర్‌కార్గో బిజినెస్‌పై ఎయిర్ ఇండియా దృష్టి పెట్టింది. ఈ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని ఎయిర్ ఇండియా తెలిపింది. 2030 నాటికి ఎయిర్ కార్గో 10 మిలియన్ టన్నులకు చేరాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు, మార్కెట్‌లో ఉనికి బలోపేతం చేసేందుకు ఎయిర్ ఇండియా వరసగా వ్యూహాత్మక చర్యలు తీసుకుంటుందని సంస్థ సీఈఓ, ఎండీ కాంప్‌బెల్ విల్సన్ తెలిపారు.
ఇందులో భాగంగా ఎయిర్ ఇండియా వచ్చే ఐదు సంవత్సరాల్లో కార్గో సామర్ధ్యాన్ని 300 శాతం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కార్గో బిజినెస్‌లో 20 లక్షల టన్నులకు చేరుకోవాలని ఎయిర్ ఇండియా నిర్ణయించుకుంది. దేశంలోని ప్రధానమైన మార్కెట్ల నుంచి ప్రపంచ వ్యాప్తంగా కీలకమైన ప్రాంతాలకు నాన్ స్టాప్ సర్వీస్‌లు నడిపేందుకు ఎయిర్ ఇండియా నిర్ణయించుకుందని ఆయన తెలిపారు.
భారీగా కార్గో బిజినెస్‌ను వృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నందునే ఎయిర్ ఇండియా ఏ350-1000 వైడీ బాడీ విమానాలు 34, ఆరు ఏ 350-900 విమానాలు, 20 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్స్, 10 బోయింగ్ 777ఎక్స్ వైడీ బాడీ విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెట్టినట్లు చెప్పారు. దేశ తయారీ రంగ లక్ష్యాలు, ఎగుమతుల లక్ష్యాలు చేరుకునేందుకు ఎయిర్ ఇండియా తన వంతుగా కృషి చేస్తుందన్నారు.
కార్గో ఇండస్ట్రీ పెరుగుదలకు ఎయిర్ ఇండియా టెక్నాలజీని కూడా వినియోగిస్తుందన్నారు. ప్రధానంగా ఐటీ సొల్యూషన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, కృతిమ మేథ ఇందుకు ఉపయోగించనున్నట్లు తెలిపింది. ఈ డిజిటల్ సొల్యూషన్స్ ఉత్పాదకను పెంచడంతో పాటు, సేవల మెరుగుదలకు ఉపయోగపతుందని తెలిపారు.కార్గో బిజినెస్ వృద్ధికి ఎయిర్ ఇండియా 24 గంటలు పని చేసే కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
కస్టమర్ సేవలను మెరుగుపరిచేందుకు ఇది తోడ్పడుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిర్ ఇండియా వివిధ ఎయిర్‌పోర్టుల్లో లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి సాట్స్‌తో కలిసి జాయింట్ వెంచర్స్‌ను ఏర్పాటు చేస్తోంది.ప్రస్తుతం ఎయిర్ ఇండియా 40 ఇంటర్నేషనల్ ప్రాంతాలకు, 38 దేశీయ ప్రాంతాలకు ఎయిర్ కార్గో సేవలు అందిస్తోంది. దీన్ని భారీగా పెంచుకోవాలని భావిస్తోంది. ఇందు కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాలు, అంతర్గత ఒప్పందాలు, ట్రాకింగ్ నెట్‌వర్క్ కనెక్షన్స్ వంటివి భారీ స్థాయిలో పెంచుకోవాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది.