టాటా గ్రూప్ నడుపుతున్న ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్ బస్ A320neo విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో టేకాఫ్ అయిన 27 నిమిషాలకే ముంబై విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ఎయిర్‌బస్ ఇంజిన్ షట్ డౌన్ అయిన కారణంగానే ఎయిర్ ఇండియా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు సంస్థ పేర్కొంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఉదయం 9:43 గంటలకు ఎయిర్ బస్ A320neo విమానం బయలుదేరింది. టేకఫ్ అయిన కొద్ది నిమిషాలకే విమానం పైలట్‌లకు ఇంజన్‌లలో అధిక ఎగ్జాస్ట్ గ్యాస్ ఉష్ణోగ్రత గురించి హెచ్చరిక వచ్చింది. దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. అధికారుల సూచన మేరకు వెంటనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
ఇక.. ఎయిర్ ఇండియా ఎయిర్‌బస్ A320neo విమానాలు CFM ఇంటర్నేషనల్ లీప్ ఇంజిన్‌లను కలిగి ఉన్నాయి. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ప్రతినిధులు స్పందిస్తూ.. ఎయిర్ ఇండియా భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని, తమ సిబ్బంది ఈ పరిస్థితులను చక్కదిద్దడంలో నైపుణ్యం కలిగి ఉన్నారని తెలిపారు. తమ ఇంజనీరింగ్, నిర్వహణ బృందాలు సమస్యను పరిశీలించారని.. విమానం ల్యాండింగ్ అయిన మరుక్షణమే ప్రయాణికులను మరో విమానంలో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం జరిగిందని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..