విమానయాన రంగంలో మన దేశం సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక విమానాల కొనుగోలుకు ఎయిర్ ఇండియా ఆర్డర్ పెట్టింది. 470 కొత్త విమానాలను కొనుగోలుకు ఇప్పటికే ఆర్డర్ పెట్టిన ఎయిర్ ఇండియా మరో 370 విమానాలు కొనుగోలు చేసేందుకు కూడా హక్కులు పొందింది. మరో వైపు ఆకాశ, ఇండిగో సంస్థలు కూడా భారీగా కొత్త విమానాలను కొనుగోలు చేస్తామని ప్రకటించాయి. మన దేశంలో విమానయాన రంగం ఏటా 7 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని బోయింగ్ సంస్థ పేర్కొంది. ఈ వృద్ధి మన దేశంలో కూడా భారీగా ఉద్యోగాలను సృష్టించనుంది. ప్రధానంగా పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ సిబ్బంది ఇలా అనేక విభాగాల్లో కొత్త ఉద్యోగాలు భారీగా రానున్నాయి.
భారీగా విమానాలను కొనుగోలు చేస్తున్న ఎయిర్ ఇండియాకు భవిష్యత్‌లో వాటిని నడిపేందుకు 6,500 మంది పైలట్లు అవసరం అవుతారని పరిశ్రమ నిపుణులు అంచనా వేశారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 113 విమానాలు ఉన్నాయి. వీటిని నడిపేందుకు 1,600 మంది పైలట్లు ఉన్నారు. ఎయిర్ ఇండియాకు అనుబంధంగా ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఏషియాకు కలిపి 850 మంది పైలట్లు ఉన్నారు. ఎయిర్ ఇండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో జాయింట్ వెంచర్‌లో ఉన్న విస్తారా ఎయిర్‌లైన్స్‌లో 600 మంది పైలట్లు ఉన్నారు. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఏషియా, విస్తారా అన్నింటి కలిపి 3 వేల మంది పైలట్లు ఉన్నారు. కొత్త విమానాలు వచ్చిన తరువాత ఎయిర్ ఇండియాకే 6,500 మంది పైలట్లు అవసరం అవుతారు. ఎయిర్ ఇండియా తాజాగా కొనుగోలు చేసేవాటిలో ఏ350 విమానాలు 40 ఉన్నాయి.
వీటిని దూర 16 గంటలకు పైగా ప్రయాణ దూరం ఉన్న ప్రాంతాలకు నడపనున్నారు. దూర ప్రయాణం చేసే ఇలాంటి ఒక్క విమానానికి 30 మంది పైలట్లు, 15 మంది కమండర్స్, 15 మంది ఫస్ట్ ఆఫీసర్స్ కావాల్సి ఉంది. ఎయిర్ ఇండియా సేకరిస్తున్న 40 ఏ350 విమానాలు నడిపేందుకే 1200 మంది పైలట్లు అవసరం అవుతారు. బోయింగ్ 777 విమానం నడిపేందుకు 26 మంది పైలట్లు అవసరం. ఎయిర్ ఇండియా ఇలాంటి 10 విమానాలను కొనుగోలు చేయనుంది. వీటి కోసం 260 మంది పైలట్లు కావాల్సి ఉంది. బోయింగ్ 787 విమానాలను 20 కొనుగోలు చేస్తోంది. ఒక్కదాన్ని నడిపేందుకు 20 మంది పైలట్లు, 10 మంది కమండర్స్, 10 మంది ఫస్ట్ ఆఫీసర్స్ కావాల్సి ఉంటుంది. వీటిని నడిపేందుకు 400 మంది పైలట్లు అవసరం. 30 వైడ్‌బాడీ విమానాలు నడిపేందుకు 660 మంది పైలట్లు కావాల్సి ఉంటుంది. 400 నారోబాడీ విమానాలను ఎయిర్ ఇండియా కొనుగోలు చేస్తోంది. ఒక్కో విమానం నడిపేందుకు 12 మంది పైలట్లు కావాల్సి ఉంది.
ఈ లెక్కన వీటిని నడిపేందుకు 4,800 మంది పైలట్లు కావాల్సి ఉంటుంది. వీరికి సిబ్బంది అదనం. రానున్న కాలంలో దేశంలో ఎయిర్ ఇండియాతో పాటు ఇతర సంస్థలు కూడా పెద్ద సంఖ్యలో విమానాలను కొనుగోలు చేయనున్నందున పైలట్లకు భారీగా అవకాశాలు ఉన్నాయని, ఇందుకు అవసరమైన శిక్షణా సంస్థలు దీనిపై దృష్టి సారించాల్సి ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సిబ్బంది కొరను అధిగమించేందుకు త్వరలోనే ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. ఒక్క ఎయిర్ ఇండియాకే వేలాది సిబ్బంది అవసరం అవుతారు. రానున్న 10 సంవత్సరాల్లో ఎయిర్ ఇండియా కొనుగోలు చేయనున్న మొత్తం 840 విమానాలు రానున్నాయి. ప్రతి ఏటా అసవరాలకు అనుగుణంగా సిబ్బందికి శిక్షణ ఇచ్చి, వారిని ఉద్యోగంలోకి తీసుకోనున్నారు.