ప్రపంచంలోని అన్ని ఖండాలలోని ఎత్తైన పర్వతాలను అధిరోహించడమే తన ముందున్న ప్రధాన ధ్యేయమని పర్వతారోహకురాలు అన్వితా రెడ్డి అన్నారు. దిగ్విజయంగా ఎవరెస్ట్‌ను అధిరోహించిన తదుపరి హైదరాబాద్ చేరుకున్న ఆమెను స్పాన్సర్స్‌గా వ్యవహరించిన అన్వితా గ్రూప్ అధినేత అత్యుత రావు బొప్పన మీడియాకు పరిచయం చేశారు. ఈ సందర్బంగా నగరంలో హోటల్ మెర్క్యూరీలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్వితా మీడియాతో మాట్లాడారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఘనతను సాధించినందుకుగాను అన్వితా రెడ్డి, కోచ్ శేఖర్ బాబులను అన్వితా గ్రూప్ మేనేజింగ్ డైరక్టర్ అచ్యుత రావు బొప్పన ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అన్వితా మాట్లాడుతూ…. తొలి నుండి తన పర్వతారోహణకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న అన్వితా గ్రూప్ అధినేతలు అచ్యుత రావు బొప్పన, నాగభూషణం బొప్పన, అనూప్ బొప్పన, శ్రీకాంత్ బొప్పనలకు తాను రుణపడి ఉంటానన్నారు. సాహస క్రీడ కావడం, ఆర్థిక పరిమితుల ఫలితంగా విముఖతతో ఉన్న తన తల్లిదండ్రులను ఒప్పించడంతో సహా గత ఎనిమిదేళ్లుగా తాను అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు తన కల సాకారమైందన్నారు. అన్విత గ్రూపు అధినేత అచ్యుత రావు మాట్లాడుతూ… అన్వితా నిబద్దత, అంకితభావాన్ని దృష్టిలో ఉంచుకుని తమ సంస్థ ఈ ప్రోత్సాహాన్ని అందించిందని, భవిష్యత్తులో సైతం ప్రపంచవ్యాప్తంగా విభిన్న శిఖరాలను అధిరోహించేందుకు అన్వితా గ్రూప్ తన మద్దతను కొనసాగిస్తుందని వివరించారు. కోచ్ శేఖర్ బాబు మాట్లాడుతూ …అన్వితా రెడ్డి శారీరక, మానసిక ఓర్పుతో సరైన పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, అనుభవాన్ని సంపాదించుకోగలిగారన్నారు. రాబోయే కాలంలో మరిన్ని విజయాల సాధనకు సిద్దం కానుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement