Saturday, November 23, 2024

Big Story: వెనుకబడిన జిల్లాలకు అందని సాయం?.. ప్రకటించిన నిధులను మరిచిన కేంద్రం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో వెనుకబడిన 9 జిల్లాల సమగ్రాభివృద్ధికి ఒక్కో జిల్లాకు ఏటా రూ.50 కోట్లను ఇవ్వాలన్న లక్ష్యం నెరవేరడంలేదు. ఒక్కో జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున 9 జిల్లాలకు ఏడాదికి రూ.450కోట్లను మూడేళ్లు అందించిన కేంద్ర ప్రభుత్వం 2017-18లో పెండింగ్‌లో పెట్టింది. ఇప్పటికే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్నది. అనేక చర్యలతో పట్టణీకరణ పెరగడంతో ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ పరిమితి దాటుతోందని కేంద్రం అంటోంది.

నీతీ ఆయోగ్‌ సూచనలతో ఆయా 9 జిల్లాలతోపాటు రాష్ట్రంలోని అత్యంత మారుమూల జిల్లాలకు మహర్ధశ పట్టించేందుకు కేంద్రం నేరుగా దృష్టిసారించింది. ఆయా ప్రతిపాదిత జిల్లాలకు ప్రత్యేక నిధులతో అభివృద్ధి పథంలోకి తేవాలని యోచించింది. రాష్ట్రంలొని అత్యంత వెనుకబడిన జిల్లాలైన జయశంకర్‌ భూపాలపల్లి, కుమరం భీం అసిఫాబాద్‌, ఖమ్మం జిల్లాలను ఈ పథకం కింద అర్హతకల్గినవిగా నీతి ఆయోగ్‌ గుర్తించింది. ఈ మూడు జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఇతర పనులకు కావాల్సిన నిధులను కేంద్రమే అందించేందుకు హామీ ఇచ్చింది. ఈ నిధులతో కేంద్ర, రాష్ట్ర పథకాలను ప్రభావంతంగా ఏకీకృతం చేసి అమలు చేయాలని సంకల్పించింది.

కేంద్ర ప్రభుత్వం గతేడాది దేశవ్యాప్తంగా 115 వెనుకబడిన జిల్లాలను గుర్తించి వాటి సత్వర అభివృద్ధికి ప్రత్యేక చర్యలను తీసుకోవాలని భావించింది. ఆయా ప్రాంతాలకు అవసరమైన కార్యక్రమాలతో ప్రజోపయోగ పథకాలను వేగంగా అమలుచేయాలని భావించింది. దేశంలొ 30సమ్మిళిత సూచీల ఆధారంగా 30అత్యంత వెనుకబడిన జిల్లాలను నీతి ఆయోగ్‌ గుర్తించింది. భూమి లేని తనం, ఆరోగ్య, పోష్టిహాకాహరం, విద్య, నీటి వసతి వంటి సౌకర్యాలు లేని 30 జిల్లాలను గుర్తించి కేంద్రానికి నివేదించింది. వివిధ మంత్రిత్వ శాఖలు కూడా కేంద్ర సూచీల ఆధారంగా మరో 50జిల్లాలు వెనుకబడినట్లుగా గుర్తించాయి.

- Advertisement -

ఆయా జిల్లాల్లో తెలంగాణకు చెందిన జయశంకర్‌ భూపాలపల్లి, కుమరంభీం అసిఫాబాద్‌, ఖమ్మం జిల్లాలను గుర్తించింది. ఆయా జిల్లాల్లో సంక్షేమ, ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు భారీ ప్రాజెక్టులు, ఇతర పనులకు కేంద్రమే నిధులను అందించనుందని తెలిపినా అమలులోకి రాలేదు. దీంతో ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌ నేరుగా ప్రధాని దృష్టికి తెచ్చారు. అయినా కేంద్రం తెలంగాణపై వివక్షతో హక్కుగా రావాల్సిన నిధులనే కాకుండా, తెలంగాణ వాటానూ కొల్లగొట్టడమే లక్ష్యంగా ముందుకు వెళుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement