Monday, November 18, 2024

AI in Healthcare Summit | ఆరోగ్య సంరక్షణలో ఏఐ : మంత్రి శ్రీధర్‌బాబు

ఆరోగ్య సంరక్షణలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం, అభివృద్ధి పరిచే అంశంలో హైదరాబాద్‌ను గ్లోబల్‌ క్యాపిటల్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్స్‌, ఇండస్ట్రీస్‌ అండ్‌ కామర్స్‌ శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు అన్నారు.

తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో ఈరోజు (సోమవారం) రహేజా ఐటి పార్కులో ఏఐ ఇన్‌ హెల్త్‌కేర్‌ సమ్మిట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ… ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులకు ఏఐ విని యోగం అన్న ప్రధాన అంశంపై ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన గ్లోబల్‌ కన్వెన్షన్‌ తరువాత ఆరోగ్య సంరక్షణలో, పరిశ్రమలు, ఉత్పత్తి రంగాల్లో కృత్తిమ మేధను సమర్థవంతంగా వినియోగించుకుని ఆర్థిక, సేవారంగాల్లో మరింత అభివృద్ధి చెందాలన్న దృఢ సంకల్పంతొ ప్రభుత్వం ఉందని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు ప్రపంచ స్థాయి లైఫ్‌ సైన్సెస్‌, హెల్త్‌ కేర్‌-2025 మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా, రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ, ఐటి, ఉత్పత్తుల రంగంలో ఏఐని వినియోగించుకోవాలన్న ఆలోచనలో భాగంగా.. మొదట హెల్త్‌ కేర్‌లో ఏఐ వాడకంపై దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలోనే కాక, దేశ విదేశాల్లో ఉన్న వైద్య రంగంలో ఏఐపై కృషిచేస్తున్న వారిని రప్పించి ఏఐ వినియోగం, ఎదురయ్యే సవాళ్లు, ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లు చెప్పారు.

ఏఐ ద్వారా మెరుగైన ప్రగతి సాధించేందుకు ప్రభుత్వం వైపు నుంచి ఈ రంగంలో పనిచేస్తున్న వారికి తగిన ప్రోత్సాహం, తోడ్పాటును అందిస్తామన్నారు. ఏఐ అభివృద్ధికి, మార్గ నిర్దేశం చేసేందకు తెలంగాణ ఏఐ అడ్వైజరి కౌన్సిల్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఏఐ వినియోగం, అభివృద్ధిలో హైదరాబాద్‌ ముందంజలో ఉండేలా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషిచేస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

- Advertisement -

ఈ సందర్భంగా జిసీసి లోగోను మంత్రి, హాజరైన ప్రముఖులు ఆవిష్కరించారు. దేశంలోని ప్రముఖ సంస్ధలపైన నోవార్టిస్‌, బిఎంఎస్‌, సనోఫి, ఆమ్‌జెన్‌, రోచె, సాండజ్‌, ధెర్మోఫిషర్‌, బయేర్‌ వంటి అనేక కంపెనీలు రాష్ట్రప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement