కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య విరామాన్ని పెంచడం పట్ల కేంద్రం తీరును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. శాస్త్రవేత్తల సమ్మతి లేకుండానే ప్రభుత్వం వ్యాక్సిన్ డోసుల మధ్య విరామాన్ని పెంచడం సరికాదని చెప్పారు. దేశమంతటా వేగంగా పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బూటకపు ప్రతిష్టను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
మోదీ ప్రభుత్వ అసమర్థ విధానంతో నెలకొన్న వ్యాక్సిన్ కొరతను దాచేందుకు బీజేపీ తనదైన శైలిలో అసత్యాలు, నినాదాలను అందుకోవడంతో ఒరిగేదేమీలేదని రాహుల్ మండిపడ్డారు. ప్రధాని మోదీ మూటగట్టుకున్న అప్రతిష్టను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో వైరస్ వ్యాప్తి పెరిగి ప్రజల ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి దారితీసిందని ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రీయ గణాంకాలతోనే రెండు వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ పెంచామని ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందని రాహుల్ పేర్కొన్నారు.