అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఈ నెల రు 14న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్-పాకిస్థాన్ లు తలపడనున్నాయి. దాయాది దేశాల మధ్య పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అహ్మదాబాద్‌కు రానున్నారు. ఇప్పటికే టిక్కెట్స్ అన్ని అమ్ముడుపోయాయి.. ఈ క్రమంలో అక్కడి హోటళ్లకు డిమాండ్ పెరిగింది. మరోవైపు మ్యాచ్ జరిగే రోజు వివిధ నగరాల నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే విమాన టికెట్ ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి.
ఇక ఇక్కడికి తరలివచ్చ ఏఏ క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. భారత్-పాక్ మ్యాచ్ జరిగే రోజున మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక వందే భారత్ రైళ్ల ను నడపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. త్వరలోనే రైళ్ల షెడ్యూల్, టికెట్ ధరల వివరాలు వెల్లడిస్తామన్నారు. భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లోని హోటళ్ల ధరలు భారీగా పెరగడం, అధిక విమాన టికెట్ ధరలు వంటి వాటి నుంచి ఉపశమనం కలిగించేందుకు వందే భారత్ ప్రత్యేక సర్వీసులను నడపాలని నిర్ణయించినట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు జాతీయ వార్త సంస్థకు వెల్లడించారు.
మ్యాచ్ ప్రారంభం కావడానికి కొన్నిగంటల ముందు ఈ ప్రత్యేక రైళ్లు సబర్మతీ, అహ్మదాబాద్ స్టేషన్లకు చేరుకుంటాయని తెలిపారు. ఈ రెండు స్టేషన్లు నరేంద్ర మోదీ స్టేడియానికి దగ్గరగా ఉండటంతో అభిమానులు సులభంగా స్టేడియానికి చేరుకోవచ్చన్నారు. అదేవిధంగా మ్యాచ్ ముగిసిన కొద్ది గంటల తర్వాత ఈ రైళ్లు అహ్మదాబాద్ నుంచి తిరిగి బయల్దేరుతాయని, దాని వల్ల అభిమానులు అదే రోజు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకోవచ్చని తెలిపారు.