Tuesday, November 19, 2024

వ్యవసాయం బాగుండాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి : మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వ్యవసాయం బాగుండాలి..రాష్ట్రంతోపాటు, రాష్ట్ర రైతాంగం బాగుండాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆకాంక్షించారు. రైతులు పండించిన పంటలు కొనే మార్కెటింగ్‌ శాఖ అద్భుతంగా ఉండాలని పేర్కొన్నారు. బుధవారం బోయిన్‌పల్లి మార్కెట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మార్కెటింగ్‌ ఉద్యోగులకు అవార్డులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, అడిషనల్‌ డైరెక్టర్లు లక్ష్మణుడు, రవికుమార్‌, ఎస్‌ఈ రాధాకృష్ణ, ఉద్యోగ సంఘాల నాయకులు చిలక నర్సింహారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపేందుకే అవార్డులు అందిస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల ప్రతిభను గుర్తించి, గౌరవించి, ప్రోత్సహించడమే దీని లక్ష్యమని తెలిపారు. ఈ అంశంలో ఒక మెట్టు ముందున్న వాళ్లను అభినందిస్తున్నాను.. మిగతా వారు ఆ మెట్టును అందుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయం విస్తరణ జరిగి, పంటల సాగు పెరిగి గణనీయంగా ఉత్పత్తులు మార్కెట్‌కు తరలివస్తే ఆ దృశ్యం చూస్తేనే కడుపు నిండుతుందన్నారు. పంటలు పండించడానికి వ్యవసాయశాఖ ఎంత కసరత్తు చేస్తుందో, రైతాంగానికి ఎంత చేయూతను, వ్యవసాయ విజ్ఞానాన్ని అందిస్తుందో.. వచ్చిన పంటను కూడా మార్కెటింగ్‌ చేసే గణనీయమైన పాత్ర మార్కెటింగ్‌ శాఖ పోషిస్తున్నదన్నారు. మార్కెటింగ్‌ శాఖ తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని చేస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు. కరోనా సమయంలో మార్కెటింగ్‌ శాఖ ఇళ్ల వద్దకే కూరగాయలు, పండ్లు రవాణా చేసి సామాన్యులకు నిత్యావసరాలు అందుబాటులో ఉంచిందని, సీఎం కేసీఆర్‌ ఈ విషయం తెలుసుకుని అభినందించారని అన్నారు. కోహెడలో భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయి అతిపెద్ద అధునాతన మార్కెట్‌ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
మన వద్ద ప్రమాణాలు బాగుంటే రైతులు ఉత్పత్తులను ఎక్కడి నుంచైనా తెచ్చి ఇక్కడే అమ్ముకుంటారు. అందుబాటులో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌రోడ్డు, రీజినల్‌ రింగ్‌రోడ్డు సమీపాన ఉన్నందున కోహెడ మార్కెట్‌కు మంచి భవిష్యత్‌ ఉన్నది అని ఆయన అభిప్రాయపడ్డారు. మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలోని ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లను సమర్థవంతంగా నిర్వహించడంపై దృష్టి సారించాలని కోరారు. మార్కెటింగ్‌ శాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, ఉద్యోగుల నియామకాల కోసం సహకారం అందిస్తానని భరోసానిచ్చారు. మార్కెటింగ్‌ శాఖలో తొలిసారి ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు అవార్డులు అందించారు. పది విభాగాల నుండి 43 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మూడు అవార్డులు గెలుచుకున్న సూపరింటెండెంట్‌ ఫర్హానాను మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement