రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం యూఏఈ చేరుకున్నారు. అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంతో సహా ఎనిమిది ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఇందులో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ఇరు దేశాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే ఎలక్ట్రికల్ ఇంటర్‌కనెక్షన్, వాణిజ్య రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం, రెండు దేశాల మధ్య ఒక అంతర్ ప్రభుత్వ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం కీలకమైనవి. వాణిజ్యం, పెట్టుబడి, డిజిటల్ అవస్థాపన, ఫిన్‌టెక్, ఇంధనం, మౌలిక సదుపాయాలు, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలతో సహా వివిధ రంగాలలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాలు ఆకాంక్షించాయి.
ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా చర్చించారు. అంతకు ముందు ఎయిర్‌పోర్టులో అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రధాని మోడీకి సాదర స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. అబుదాబిలో తొలి హిందూ దేవాలయం నిర్మాణానికి సహకరించి నందుకు యూఏఈ అధ్యక్షుడికి మోడీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో, ఇరుదేశాల మధ్య అనేక రంగాలలో పరస్పర భాగస్వామ్యాన్ని మోడీ హైలైట్ చేశారు. మీరు చెప్పినట్లుగా, నేను ఇక్కడికి వచ్చినప్పు డల్లా, నా ఇంటికి వచ్చినట్లు భావిస్తుంటాను అని జాయెద్ అల్ నహ్యాన్‌తో ప్రధాని అన్నారు. 2015లో యూఏఈలో దౌత్య పర్యటనుఏ గుర్తుచేసుకున్న మోడీ, మూడు దశాబ్దాల తర్వాత గల్ఫ్ దేశానికి భారత ప్రధానిగా తాను రావడం జరిగిందన్నారు. ఆ సమయంలో అప్పటి యువరాజు, నేటి అధ్యక్షుడు తన ఐదుగురు సోదరులతో కలిసి విమానాశ్రయంలో నాకు స్వాగతం పలికారు అని చెప్పారు. ఆ స్వాగతం నాకు మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారతీయులకు కూడా అని అన్నారు.
భారత్ విశ్వబంధు..
ప్రపంచం భారత్‌ను ‘విశ్వ బంధు’గా చూస్తోందని, ఎక్కడ సంక్షోభం వచ్చినా అక్కడికి చేరుకునే మొదటి దేశాల్లో భారత్ ఉందని మోడీ ఉద్ఘాటించారు. ఈ రోజు ప్రపంచంలోని ప్రతి ప్రధాన వేదికపై భారతదేశం గొంతుక వినిపిస్తోంది. నేటి బలమైన భారతదేశం అడుగడుగునా ప్రజలకు అండగా నిలుస్తోంది. యుఎఇ భారతదేశానికి మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఏడవ అతిపెద్ద పెట్టుబడిదారు కూడా.
ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఇరు దేశాలు చాలా సహకరిస్తున్నాయని, ఈ రోజు కూడా మన మధ్య కుదిరిన ఎంఓయూలు ఈ నిబద్ధతను ముందుకు తీసుకెళ్తున్నాయని మోడీ అన్నారు. రెండు దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను ఏకీకృతం చేస్తున్నాయని, సాంకేతికత, ఆవిష్కరణల రంగంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నాయని ఆయన అన్నారు.
రూపే కార్డు ప్రారంభం
మోడీ, జాయెద్ అల్ నహ్యాన్ అబుదాబిలో రూపే కార్డ్ సేవలను ప్రారంభించారు. ”మై యూపీఐ రూపే కార్డ్, యువర్ జెవాన్ కార్డ్‌ను ప్రారంభించడం ద్వారా మేము కొత్త ఫిన్‌టెక్ యుగాన్ని ప్రారంభిస్తున్నాము అని మోడీ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, రెండు దేశాల మధ్య. జరిగిన అనేక ద్వైపాక్షిక ఒప్పందాలలో ఇదొకటి. ఇది దేశాల మధ్య సరిహద్దు లావాదేవీలను మరింత సులభతరం చేయడానికి దోహదం చేస్తుంది.