అగ్నిపథ్ స్కీమ్ కేంద్రం ప్రవేశపెట్టినప్పటి నుంచి యువత నుంచి వ్యతిరేఖత మొదలైంది. దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వేస్టేషన్ ల వద్ద విధ్వంసం కొనసాగుతోంది. ఇవాళ కూడా బీహార్‌లో యువత చెలరేగిపోయారు. కొత్త ఆర్మీ రిక్రూట్మెంట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఇవాళ నిరసనకారులు బీహార్‌లోని లఖ్మినియా రైల్వే స్టేషన్‌కు నిప్పుపెట్టారు. రైల్వే ట్రాక్‌లను ధ్వంసం చేసి రైళ్లను నిలిపివేశారు. నాలుగేళ్ల ఉద్యోగం పేరుతో అగ్నిపథ్ స్కీమ్‌ను రక్షణ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. భగల్‌పూర్, న్యూఢిల్లీ మధ్య నడిచే విక్రమ్‌శిలా ఎక్స్‌ప్రెస్, జమ్మూతావి-గౌహతి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నిరసనకారులు నిప్పుపెట్టారు. అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేయాలని 72 గంటల డెడ్‌లైన్ జారీ చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోనూ ఆర్మీ అభ్యర్థులు భారీ విధ్వంసాన్ని సృష్టించారు. స్టేషన్‌లో ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఫ్లాట్‌ఫాంపై ఉన్న రైలుకు నిపుపెట్టారు. ఏసీ బోగీల అద్దాలను పగులగొట్టారు. గూడ్స్ రైలులో ఉన్న సామాన్లను పట్టాలపై పడేశారు. ఫ్లాట్‌ఫామ్‌పైన ఉన్న షాపులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. భయాందోళనలకు గురైన ప్రయాణికులు స్టేషన్ విడిచి వెళ్తుతున్న దృశ్యాలు కనిపించాయి.
వయోపరిమితి పెంచాం..
గడిచిన రెండేళ్ల నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ జరగలేదని, దీని వల్ల దేశ యువత ఆర్మీలోకి ప్రవేశించలేకపోయిందని, దాని వల్లే ఆర్మీ అభ్యర్థుల వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్ల వరకు పెంచినట్లు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.