భద్రతా కారణాల వల్ల విశాఖపట్నం రైల్వేస్టేషన్ ని మూసివేశారు. అగ్నిపథ్ వల్ల నిన్న పలు రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రైల్వే అధికారులు విశాఖపట్టణం రైల్వే స్టేషన్ను మూసివేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిన్న జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు స్టేషన్ మూతలో ఉంటుందని, అప్పటి వరకు ఎవరినీ లోపలికి అనుమతించబోమని ప్రకటించారు.
ఇప్పటికే బయలుదేరి విజయవాడ మీదుగా విశాఖపట్టణం చేరుకోవాల్సిన రైళ్లను దువ్వాడ వద్ద, హౌరా నుంచి వచ్చే రైళ్లను కొత్తవలస వద్ద నిలిపివేసి దారి మళ్లిస్తామని అధికారులు తెలిపారు.రైళ్లు విశాఖ రాకుండా చర్యలు తీసుకున్న అధికారులు.. స్టేషన్కు అర కిలోమీటరు ముందు బారికేడ్లు ఏర్పాటు చేసి స్టేషన్లోకి ఎవరూ చొరబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఉదయం ఏడు గంటల వరకు ఉన్న ప్రయాణికులను మాత్రం తనిఖీల అనంతరం స్టేషన్లోకి అనుమతించారు. స్టేషన్ వద్ద భారీగా బలగాలను మోహరించారు.