అగ్నిపథ్ ..ఇండియా అంతటా ఇప్పుడు ఈ పేరుతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ఆర్మీలో నియామకాల కోసం కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చింది.నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీర్ తొలి బ్యాచ్ వారికి.. గరిష్ఠ వయో పరిమితిలో మొత్తం ఐదేళ్లు సడలింపు కల్పించనున్నట్టుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.అంతేకాకుండా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్, అస్సాం రైఫిల్స్‌లో ‘అగ్నివీర్’లకు 10 శాతం రిజర్వేషన్లను కల్పించనున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండు పారామిలటరీ బలగాలలో రిక్రూట్‌మెంట్ కోసం అగ్నివీర్‌లకు నిర్దేశించిన గరిష్ట వయోపరిమితి కంటే మూడేళ్ల వయోపరిమితి సడలింపును కూడా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
గత మూడు రోజులుగా అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల పెద్దఎత్తున ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి.
కొన్ని చోట్ల ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు రైళ్లకు నిప్పుపెట్టారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకున్న అల్లర్లలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మరణించగా.. పలువురు గాయపడ్డారు. కొత్త మిలటరీ రిక్రూట్‌మెంట్ స్కీమ్ వయో పరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు మారుస్తూ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.గత రెండేళ్లుగా ఎలాంటి రిక్రూట్‌మెంట్ జరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సరిహద్దు భద్రతా దళం (BSF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), శాస్త్ర సీమా బల్ (SSB), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF).. ఐదు విభాగాల్లో 73,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. CAPFలు, అస్సాం రైఫిల్స్‌లో 73,219 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీసు బలగాల్లో 18,124 పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి.