న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : యువతకు అగ్ని పరీక్ష పెడుతున్న అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐఏడబ్ల్యు) రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు, దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఏఐఏడబ్ల్యు జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ శుక్రవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… సికింద్రాబాద్ ఘటనలో యువకుడి మృతికి ప్రధాని మోదీయే కారణమని ఆరోపించారు. సంవత్సరాల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత పాలిట ఈ పథకం పిడుగుపాటని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో కాంట్రాక్ట్, క్యాజువల్ విధానాలను అవలంభిస్తున్న బీజేపీ సర్కార్ రక్షణ రంగాన్ని కూడా కాంట్రాక్ట్రీకరిస్తోందని విమర్శించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని దళిత, గిరిజన, బలహీన వర్గాలకు చెందిన వారే రక్షణ రంగంలో చేరే వారిలో ఉంటున్నారని వెంకట్ చెప్పుకొచ్చారు. కార్మిక కర్షక కుటుంబాలు నుంచి వచ్చిన యువతకు అగ్నిపథ్ తీవ్ర నష్టం చేస్తుందని అభిప్రాయపడ్డారు. పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన రాకేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ఘటనపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఈ పథకాన్ని రద్దు చేయాలంటూ కేంద్రానికి లేఖలు రాయాలని కోరారు. కార్పొరేట్లకు లక్షల కోట్లు రాయితీలు కల్పిస్తూ దేశ రక్షణకు ప్రాణాలకు తెగించి విధుల్లో చేరడానికి సిద్ధమైన యువతకు, రక్షణ రంగానికి నిధులు కేటాయించడానికి నిరాకరించడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్ధంగానే బీజేపీ ప్రభుత్వం రక్షణ రంగాన్ని ప్రైవేట్ శక్తులకు కట్టబెట్టేందుకు నాటకమాడుతోందని వెంకట్ ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నించిన మోదీ ప్రయత్నాలను కార్మిక కర్షక కష్టజీవులంతా కలిసి సమైక్యంగా తిప్పికొట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అగ్నిపథ్ రద్దయ్యే వరకు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.