హైదరాబాద్,ఆంధ్రప్రభ: రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలకు తెరతీసింది. ఇప్పటివరకు పోటీకి సిద్ధం అంటూ 250 మంది దరఖాస్తు చేసుకోగా ఆజాబితాను రాజమండ్రిలో ఉన్న చంద్రబాబు పరిశీలనకు వెళ్లింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఈ జాబితాను చంద్రబాబుకు సమర్పించారు.
ఈ జాబితాను వడబోసి తొలిజాబితాగా 36 మంది అభ్యర్థులతో బుధవారం నాటికి జాబితాను విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు కాసానికి సూచించినట్లు సమాచారం. ఈ తొలిజాబితాలో ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటుగా సికింద్రాబాద్, కూకట్ పల్లి నియోజకవర్గాలున్నట్లు సమాచారం. తొలి జాబితా అనంతరం నవంబర్ మొదటి వారంలోగా మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు టీటీడీపీ కసరత్తు చేస్తోంది.
చంద్రబాబుతో సమావేశమైన అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వీడియో కాన్పరెన్స్ లో ముఖ్యనేతలతో పాటుగా నియోజకవర్గాల్లోని నాయకులతో సమావేశమయ్యారు. అయితే గెలుపు ఓటములు ఎన్నికల క్షేత్రంలోఓటర్లు ఇచ్చే తీర్పు పైన ఆధారపడి ఉన్నప్పటికీ టీడీపీ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీకి అభ్యర్థులను సిద్ధం చేస్తోంది.
చంద్రబాబుతో సమావేశం అయిన అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో సమావేశమై రాజకీయ పరిస్థితులను సమీక్షించారు. అలాగే నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలు, రాష్ట్ర ప్రజలకు ఇచ్చే హామీలపై సంక్షిప్తంగా మేనిఫెస్టో లో పొందుపర్చి అభ్యర్థుల తొలిజాబితాతో పాటుగా విడుదల చేసేందుకు పార్టీ నాయకత్వం యోచిస్తోంది.
ప్రస్తుతం కూకట్ పల్లి నుంచి నందమూరి సుహాసి, సికింద్రాబాద్ నుంచి కాసానిజ్ఞానేశ్వర్ పోటీ చేయనున్నట్లు పక్కా సమాచారం. అలాగే వనపర్తి నుంచి రావుల చంద్రశేఖర్ ను పోటీలో దించాలని పార్టీ యోచిస్తోంది. కంభంపాటిని పార్లమెంట్ అభ్యర్థుగా పోటీలో దించేందుకు పార్టీ ఆలోచిస్తున్న నేపథ్యంలో శాసన సభ ఎన్నికల్లో కీలక బాధ్యతలను కంభం పాటికి అప్పగించేందుకు పార్టీ యోచిస్తోంది. గోషామహల్ నుంచి అరనింద్ కుమార్ గౌడ్ ను పోటీలోకి పార్టీ దించనున్నట్లు సమాచారం.
అయితే అత్యధికంగా ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా పార్టీ జాబితాను వడబోసి తుదినిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో బాలకృష్ణ పర్యటనల అనంతరం రెండవ జాబితాను ప్రకటించే అవకాశాలున్నాయి. తొమ్మిదేళ్ల విరామం అనంతరం తెలంగాణ లో తొలిసారిగా 119 నియోజకవర్గాల్లో పోటీకి సై అంటున్న టీటీడీ తగ్గేదే లేదంటూ ముందుకు వెళ్లుతోంది.