న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిష్కరించడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని బీజేపీ రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఆయన ఢిల్లీలో శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఇది తెలంగాణ ప్రజలకు నష్టదాయకమే తప్ప ఆ సమావేశాన్ని బహిష్కరించడం ద్వారా ఒరిగేదేమీ ఉండదన్నారు. గతంలో ప్లానింగ్ కమిషన్ ఎదుట ముఖ్యమంత్రులు గంటల తరబడి చేతులు కట్టుకుని వినడమే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. నీతి అయోగ్ ఏర్పాటు ద్వారా అనేక అంశాలను ప్రస్తావించే అవకాశాన్ని, అభిప్రాయాలను వెలిబుచ్చే వెసులుబాటును కల్పించి ముఖ్యమంత్రుల గౌరవాన్ని పెంచి టీం ఇండియా స్పూర్తిని చాటిన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని లక్ష్మణ్ కొనియాడారు. రాజకీయ లబ్ది కోసం అవాకులు చవాకులు పేలడం కేసీఆర్ కుసంస్కారానికి నిదర్శనమని విమర్శించారు. 2004 నుంచి 2014 వరకు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆనాడు అవసరం లేని వ్యక్తులు, సంస్థలకు బ్యాంకులకు ఎడాపెడా రుణాలిప్పించడంవల్లే అవన్నీ నేడు నిరర్ధక ఆస్తులుగా మారాయనే విషయాన్ని విస్మరించారన్నారు. నిజంగా కేసీఆర్కు చిత్తశుద్ది ఉంటే ఈ అంశంపై చర్చకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో భారత్ నాలుగో అతిపెద్ద దేశమన్న లక్షణ్… అమెరికా, చైనా, జపాన్ తర్వాత అత్యధిక విదేశీ మారక ద్రవ్య నిల్వలున్న దేశం భారత్ అనే వాస్తవాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని సూచించారు. భారత్ అభివృద్ధి పథంలో ఉంటే కేసీఆర్ నిత్యం శ్రీలంక, చైనా దేశాల జపం చేయడం వెనుక మర్మమేమిటో చెప్పాలన్నారు. కేసీఆర్ మాట్లాడినవన్నీ అబద్దాలు, అర్ధ సత్యాలేనని చెప్పుకొచ్చారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేంద్రంపై బురద చల్లి రాజకీయ లబ్ది పొందేందుకు చేసిన కుట్రగానే భావిస్తున్నామని తెలిపారు. ఆయన లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని, ప్రజాక్షేత్రంలోనే కేసీఆర్ బండారాన్ని బయటపెడతామని లక్ష్మణ్ హెచ్చరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement